పెద్దాయన కారణంగా అవకాశం కోల్పోయిన శివారెడ్డి!
తాజాగా శివారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆవేంటో ఆయన మాటల్లోనే..
మిమిక్రీ ఆర్టిస్ట్ కం నటుడు శివారెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో ఎదిగిన నటుడు. స్టార్ హీరోల వాయిస్ లను అచ్చు గుద్దినట్లు దించడంలో అతడో స్పెషలిస్ట్. అలాగే రాజకీయ నాయకులు వాయిస్ ల్ని సైతం అవపోశాన పట్టేసిన ఆర్టిస్ట్ . అందుకే శివారెడ్డి అంటే అందరికీ వెల్ నోన్.
నటుడైన తర్వాత మిమిక్రీని వదల్లేదు. ఓవైపు మిమిక్రీ చేస్తూనే సినిమాలు చేసేవాడు. అలా రెండు పడవల ప్రయాణం సాగించాడు. అయితే కాల క్రమంలో ఇండస్ట్రీలో పోటీ పెరగడం సహా , కొత్త నటీనటులు రావడంతో శివారెడ్డి సహా అతడి జనరేషన్ నటులందరికీ అవకాశాలు తగ్గాయి. తాజాగా శివారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆవేంటో ఆయన మాటల్లోనే..
` మా ఫ్యామిలీ పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకోలేక, నేను మిమిక్రీ ఆర్టిస్టుగా , నటుడిగా మారాలనుకున్నాను. సానా యాదిరెడ్డిగారు 'పిట్టలదొర' సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత వరుస సినిమాలలో అవకాశాలు రావడం మొదలైంది. ఒక వైపున సినిమాలతో .. మరో వైపున స్టేజ్ షోస్ తో బిజీగా ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఒక సంఘటన జరిగింది. ఒక రోజున నేను చెన్నైలో షూటింగులో ఉన్నాను.
మేకప్ చేసుకుని సీన్ కి రెడీ అవుతున్నాను. అంతలో అక్కడికి వచ్చిన ఒక పెద్ద ఆర్టిస్ట్, నేను ఆ ప్రాజెక్టులో ఉంటే తాను చేయనని చెప్పాడు. దాంతో నన్ను ఆ సినిమాలో నుంచి తీసేశారు. దాంతో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే వరకూ ఏడుస్తూనే ఉన్నాను. ఇంత టాలెంట్ ఉన్న నాకు అవకాశాలు రావడం లేదంటే, నా వెనుక పాలిటిక్స్ జరిగాయనే అనుకోవాలి` అని అన్నాడు.