నాపై విష ప్ర‌చారం చేస్తున్నారు.. సింగ‌ర్ మంగ్లీ లేఖ‌

మంగ్లీ స్వ‌యంగా రాసిన లేఖ‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

Update: 2025-02-15 13:03 GMT

నాపై విష ప్ర‌చారం చేస్తున్నారంటూ సింగ‌ర్ మంగ్లీ సంచ‌ల‌న లేఖ రాసారు. గత వారం రోజులుగా తనపై జరుగుతున్న విష ప్రచారాన్నిచెప్పుకునేందుకు బహిరంగ లేఖ రాస్తున్నాన‌ని అన్నారు. త‌న‌ను త‌న పాట‌ను ఆద‌రించిన ప్ర‌జ‌లు, అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంగ్లీ త‌న‌పై రాజ‌కీయాలు రుద్ది త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆవేద‌న చెందారు. మంగ్లీ స్వ‌యంగా రాసిన లేఖ‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.

శ్రీకాకుళంలో ప్రతి ఏటా జరిగే గొప్ప ఆధ్యాత్మిక వేడుకైన అరసవల్లి రథసప్తమి వేడుకల్లో నన్ను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మ్యూజికల్ ఈవెంట్‌ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మీ అందరికి తెలుసు. శ్రీకాకుళం ప్రజలు నాపై చూపిన అభిమానం ఈ జన్మలో మరువలేనిది. మరో జన్మంటూ ఉంటే ఈ సిక్కోలు గడ్డపై పుడతానని వేదికపైనే నా కృతజ్ఞత తెలుపుకున్నాను. ఈ ప్రోగ్రాంలో కేంద్రమంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది జనం ముందు నాతో పాటు నా టీంను సత్కరించి అభినందించారు. కార్యక్రమం అనంతరం తొలిసారిగా ప్రత్యక్ష దైవం శ్రీసూర్యభగవానుని ఆలయాన్ని దర్శించాలనుకున్న సందర్భంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబం ఒక కళాకారిణిగా నన్ను వాళ్లతోపాటు ఆహ్వానించింది. ఇక్కడ మంత్రిగారు, ఎమ్మెల్యేగారి స్థానంలో ఎవరున్నా దైవ దర్శన భాగ్యం కల్పించేవారు. కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఆ కుటుంబం నన్ను ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించారు. గొప్పమనసుతో కళాకారిణిగా నన్ను గౌరవించడం తప్పు అవుతుందా ?

దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయటం అన్యాయం కాదా? 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపి కి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాటపాడాను. దాని తర్వాత రెండు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాను. అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా ప్రచారంలో పాల్గోనాల్సి వచ్చింది కాని ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్క మాట అనలేదు, దూషించలేదు. నేను ఎక్కడా పార్టీ జెండా దరించలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాడాను. వైఎస్సార్సీపీ ఒక్కటే కాదు, బిజెపి, టీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడాను అని మంగ్లీ తెలిపారు. కాని అప్పటికే నాపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు నా పాట దూరమయ్యింది. దీంతో చాలా అవకాశాలు కోల్పోయాను. అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ కారణంగానే 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీతో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారపాటలు పాడాలని కోరినా సున్నితంగా తిరస్కరించాను.

నా పాట ప్రతీ ఇంట్లో పండగ పాట కావాలేకాని పార్టీల పాట కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాలకు అతీతంగా నన్ను అందరూ ఆదరించాలని, అభిమానించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బంజారా జాతి నుండి వచ్చి కల్చరల్ పాటలు పాడతున్నసందర్భంలో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలో చదువుకున్నా అనే నేపథ్యంలో ఒక కళాకారిణీగా గుర్తించి ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఛానల్ అధికారులు నన్ను సంప్రదించారు. నేను ఆ పదవి స్వీకరించాలా వద్దా అని చాలా రోజులు తర్జన భర్జన పడ్డాను. ఇది రాజకీయ పదవి కాదని, అప్పటికే చాలా మంది కళాకారులు సలహాదారులుగా చేశారని నా శ్రేయోభిలాషులు సూచించారు. పైగా మా ఇంటి ఇలవేల్పు శ్రీవారికి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఆ పదవిని కొనసాగించానే తప్ప ఎక్కడా బహిరంగంగా ఆ పదవి గురించి ప్రకటించుకోలేదు. నేను పాటను నమ్ముకునే వచ్చాను కాని పార్టీలను, పదవులను నమ్ముకొని రాలేదని వేడుకుంటున్నాను.

నారా చంద్రబాబు నాయుడు నేను ఎక్కడా అనని మాటలను, ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలీకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ది కోసం ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు. ``చంద్రబాబు గారికి నేను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసే చెబుతున్నాను``. మొదట్లో వైఎస్సార్సిపికి పాడిన కారణంగానే కావచ్చు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరూ కూడ నన్ను సంప్రదించలేదు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంతపెద్ద మనిషిని నేను అంతమాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా ? 2019 ఎన్నికల్లోని విడియో క్లిప్పులతో రాజకీయపార్టీలకు ముడిపెట్టి నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయటం చాలా బాధాకరం. నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు కాని, పక్షపాతాలు కాని లేవు, నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాను. అందరు నాయకులపై నాకు గౌరవం ఉంది.

ప్రతి ఒక్కరూ నాకు ఆదర్శనీయులు. నేను హాజరయ్యే కార్యక్రమాలు కేవలం కళాదృష్టిలోనే చూడమని వేడుకుంటున్నాను. ఒక కళాకారిణిగా నాకు నా పాటె అన్నింటికన్నా ముఖ్యం. కళకు, కళాకారులకు ఎల్లలులేవని, ఎటువంటి బేధభావాలూ ఉండవని నమ్ముతున్నాను. దయచేసి నా పాటకు రాజకీయ రంగు పులమెద్దని, ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధంలేదని మరోసారి మీకు విన్నవించుకుంటున్నాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను నాపాటను ఇలాగే ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారనికోరుకుంటూ.. మీ అందరి మంగ్లీ`` అని సుదీర్ఘ లేఖ‌ను రాసారు. త‌న‌ను అన‌వ‌స‌ర రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని మంగ్లీ ఈ లేఖ‌లో అభ్య‌ర్థించారు. పార్టీల ప‌రంగా బుర‌ద జ‌ల్ల‌డాన్ని వ్య‌తిరేకించారు.

Tags:    

Similar News