యానిమాల్ పాపతో అలాంటి రీమేకా?

బాలీవుడ్ లో కొందరు దర్శక నిర్మాతలు తరచుగా సౌత్ కథలను రీమేక్ చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు.

Update: 2024-05-28 06:19 GMT

బాలీవుడ్ లో కొందరు దర్శక నిర్మాతలు తరచుగా సౌత్ కథలను రీమేక్ చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఎక్కువ భాగం రీమేక్ లు కమర్షియల్ గా సక్సెస్ అయినప్పటికీ అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు నార్త్ ఆడియెన్స్ సౌత్ సినిమాలను ఎగబడి చూస్తున్నారు. ఒకప్పుడు 'రెడి', 'విక్రమార్కుడు', 'పోకిరి', 'ఒక్కడు', 'మర్యాద రామన్న', 'ఖైదీ', 'అల వైకుంఠపురములో', 'డ్రైవింగ్ లైసెన్స్', 'స్టాలిన్', 'రమణ' వంటి ఎన్నో చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్ అయినప్పటికీ, అవి ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు.

ఈ జాబితాలో మరాఠీ బ్లాక్‌బస్టర్ 'సైరాట్' యొక్క హిందీ రీమేక్ 'ధడక్' కూడా చేరింది. జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించినప్పటికీ, 'సైరాట్' యొక్క అసలు మేజిక్‌ను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు, కరణ్ జోహర్ 'ధడక్ 2' ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది - 'యానిమల్' ఫేమ్ త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రం పా రంజిత్ నిర్మించిన మరి సెల్వరాజ్ యొక్క 'పరియేరం పెరుమాళ్' ఆధారంగా రూపొందించనున్నారు. 2018లో విడుదలైన 'పరియేరం పెరుమాళ్' తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో కులవివక్షను తేటతెల్లం చేసింది. పల్లర్ కులానికి చెందిన హీరో ఎదుర్కొన్న వివక్షను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ చిత్రం కంటెంట్ బోల్డ్ అప్రోచ్ కారణంగా విమర్శకుల ప్రశంసలు పొందింది.

సామాజిక సమస్యలను తీర్చిదిద్దిన తీరు ప్రశంసలు పొందడంతో పాటు వివాదాలు కూడా సృష్టించింది. ఈ చిత్రానికి సంబంధించిన సౌండ్‌ట్రాక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 'పరియేరం పెరుమాళ్' వంటి సినిమాలను రీమేక్ చేయడం అంటే చాలా పెద్ద బాధ్యత. సామాజిక అంశాలను అర్ధం చేసుకుని, వాటిని న్యాయంగా ప్రదర్శించగలిగితేనే ఈ చిత్రం విజయవంతం అవుతుంది.

కానీ బాలీవుడ్ లో చాలా వరకు మార్పులు చేర్పులు చేసే విధానం కమర్షియల్ హంగులకు దగ్గరగా ఉంటాయి. త్రిప్తి దిమ్రీ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారు అంటే కచ్చితంగా గ్లామర్ డోస్ గట్టిగానే ఉండవచ్చు. అలా లేకున్నా ఉన్నది ఉన్నట్లు తీయడం బాలీవుడ్ వారికి ఏమాత్రం నచ్చదు. మరి మార్పులు చేయగలిగితే బాలీవుడ్ ఈ సారి విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి.

త్రిప్తి దిమ్రి మరియు సిద్ధాంత్ చతుర్వేది వంటి యంగ్ టాలెంట్స్ ఈ సినిమాలో నటిస్తుండటం మంచి విశేషం. అయితే, కేవలం నటుల ప్రతిభతోనే కాకుండా, కథను న్యాయంగా అల్లడం, సామాజిక అంశాలను బాగా ప్రదర్శించడం ఈ చిత్ర విజయానికి కీలకం. మరి 'ధడక్ 2' లో ఈసారి బాలీవుడ్ సామాజిక అంశాలను ఏ విధంగా ప్రదర్శిస్తారో చూడాలి.

Tags:    

Similar News