ఇంట్రెస్టింగ్ గా త్రిష 'ఐడెంటిటీ' ట్రైలర్.. యాక్షన్ తో అదరగొట్టిన టొవినో!
దీంతో 2018 చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేస్తే, ఇక్కడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
కోవిడ్ పాండమిక్ టైంలో ఓటీటీల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ విలక్షణ నటుడు టొవినో థామస్. అతను నటించిన 'ఫోరెన్సిక్' 'కాలా' 'మిన్నల్ మురళి' 'తల్లుమాల', 'అన్వేషిప్పిన్ కాండెతుమ్' లాంటి చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. దీంతో 2018 చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేస్తే, ఇక్కడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ మలయాళంలో హిట్టైన ARM సినిమాని మాత్రం మనోళ్లు పెద్దగా పట్టించుకోలేదు. అయినప్పటికీ ఇప్పుడు ''ఐడెంటిటీ'' అనే ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ తో అలరించడానికి వస్తున్నారు టొవినో. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసారు.
'ఐడెంటిటీ' సినిమాలో టొవినో థామస్, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వినయ్ రాయ్, మందిర బేడి ముఖ్య పాత్రలు పోషించారు. జనవరి 2న కేరళలో రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే మలయాళంలో రూ. 50 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ క్రమంలో రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 24వ తేదీన తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో చిత్ర బృందం రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తించేలా సాగింది.
ట్రైలర్ లోకి వెళ్తే.. టొవినో థామస్ ఒక ప్రొఫెషనల్ స్కెచ్ ఆర్టిస్టుగా కనిపిస్తున్నాడు. ఓ మిస్టీరియస్ మర్డర్ కేసులో సాక్షిగా ఉన్న త్రిష, ఫోటోగ్రాఫిక్ మెమొరీ ద్వారా హంతకుడిని గుర్తు పట్టడానికి ట్రై చేస్తోంది. ఆమె చెప్పే వివరాలతో టొవినో హంతకుడి స్కెచ్ గీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే కేసుకి సంబంధించిన స్పెసిఫిక్ డీటెయిల్స్, టైం లైన్ తెలియకుండా కొన్ని వారాల క్రితం చూసిన ముఖాన్ని రీక్రియేట్ చేయడం చాలా కష్టమని టొవినో చెబుతున్నాడు. ఇందులో వినయ్ రాయ్, అజు వర్గీస్ పోలీసాఫీసర్లుగా కనిపిస్తున్నారు. మందిర బేడి, ఆదిత్య మీనన్ వంటి పలువురు నటీనటులను ట్రైలర్ లో మనం చూడొచ్చు.
ఓవరాల్ గా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చుట్టూ అల్లుకున్న కథతో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. టొవినో థామస్ స్టైలిష్ గా ఉన్నాడు. అతని పాత్రకు ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్లు హింట్ ఇచ్చారు. త్రిష పాత్రలోనూ ఏదో ట్విస్ట్ ఉందేమో అనిపించేలా ట్రైలర్ కట్ చేసారు. సినిమాలో యాక్షన్ కు పెద్ద పీట వేసినట్లున్నారు. రన్నింగ్ లో ఉన్న ఫ్లైట్ లో జరిగే యాక్షన్స్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. నిర్మాతలు భారీగానే ఖర్చు చేసి సినిమా తీసినట్లు తెలుస్తోంది.
''ఐడెంటిటీ'' చిత్రాన్ని అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా తెరకెక్కించారు. దర్శక ద్వయం 'ఫోరెన్సిక్' తర్వాత టోవినో థామస్ తో చేసిన సినిమా ఇది. రాగం మూవీస్, కాన్ఫిడెంట్ గ్రూప్ బ్యానర్‌లపై రాజు మల్లియత్, రాయ్ సీ.జే సంయుక్తంగా నిర్మించారు. మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో వేదాక్షర చింతపల్లి రామారావు ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. మరి తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు ఉన్న ఈ మలయాళ డబ్బింగ్ మూవీ.. టాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.