తమ్ముడిని స్టార్‌గా నిలబెట్టిన పవన్ హీరోయిన్
శంకర్ దర్శకత్వం వహించిన `బాయ్స్` చిత్రంతో నకుల్ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు.
శంకర్ దర్శకత్వం వహించిన `బాయ్స్` చిత్రంతో నకుల్ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇందులో సిద్ధార్థ్, ఎస్.ఎస్.థమన్ కూడా నలుగురు బోయ్స్ లో ఉన్నారు. ఆ నలుగురిలో ఒకడిగా నకుల్ నటనకు మంచి గుర్తింపు దక్కింది. తమిళంలో అతడు ఇప్పుడు స్టార్ అయ్యాడు. `కాదలిల్ విలుంతేన్` చిత్రంతో నకుల్ నటుడిగా అద్భుతమైన పరివర్తన చూపించాడు. అతడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి నిరంతర ప్రయత్నాలు కొనసాగించాడు. కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలతో నిరూపించాడు. నకుల్ తదుపరి `వాస్కో డా గామా`లో నటించాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
అయితే నకుల్ ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది తెలిసింది తక్కువమందికే. అతడు ప్రముఖ కథానాయిక దేవయానికి స్వయానా తమ్ముడు అనేది తక్కువమందికి తెలుసు. తన సోదరుడి కెరీర్ ఎదుగుదల కోసం అక్క హోదాలో అతడికి ఎన్నో విషయాలను నేర్పించింది. నటనలో మెరుగులు దిద్దింది. ఇక దేవయాని ఎవరో పరిచయం అవసరం లేదు. తళా అజిత్ క్లాసిక్ హిట్ చిత్రం ప్రేమ లేఖలో దేవయాని కథానాయిక. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గోకుళంలో సీత చిత్రంలో నటించింది. తన కాలంలో అద్భుతమైన అభినయనేత్రిగా దేవయాని గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రేమలేఖ చిత్రంలో కళ్లతోనే హావభావాలు ఒలికించే ప్రేమికురాలిగా మైమరిపించింది. గ్లామరస్ రోల్స్ కంటే సాంప్రదాయమైన అమ్మాయిగానే దేవయాని కనిపించింది. తెలుగు-తమిళంలో గొప్ప అభిమానులను సంపాదించుకుంది.
అందుకే దేవయాని తరపు వారసత్వం ఇండస్ట్రీలో ఉన్నారు! అనగానే ఆసక్తి నెలకొంది. దేవయాని సోదరుడు నకుల్ నటించిన `వాస్కో డా గామా` ప్రెస్ మీట్ జూలై 20న చెన్నైలో జరిగింది. నటి దేవయాని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తన సోదరుడిని కొనియాడారు. నకుల్ తనపై తనకు ఉన్న నమ్మకాన్ని ఈ వేదికపై దేవయాని మెచ్చుకుంది. వాస్కో డ గామా పెద్ద విజయం సాధిస్తుందని దేవయాని నమ్మకం వ్యక్తం చేసారు. అంతేకాదు నకుల్ నటన లాగే ఎంపికలు విలక్షణంగా ఉంటాయని, అతడు రెగ్యులర్ సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని కూడా దేవయాని వివరించింది. మంచి నటుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తాడు. సరైన సబ్జెక్ట్, దర్శకులను ఎంచుకోవడానికి నకుల్ ఆసక్తిగా ఉన్నాడు... అని దేవయాని తెలిపారు.
అక్క ఎప్పుడూ తన తమ్ముడికి తల్లిలాంటిదని దేవయాని నకుల్‌తో తనకున్న మాతృ బంధం గురించి కూడా ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు. చిన్న పిల్లవాడు నకుల్ అంటూ వ్యాఖ్యానించిన దేవయాని తన సోదరుడు తదుపరి చిత్రాలతో పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. నకుల్ తన సోదరి మాట్లాడటం చూసి ఉద్వేగానికి లోనయ్యాడు. సెంటిమెంటల్ నటుడు తన కన్నీళ్లను నియంత్రించలేకపోయాడు. ఆర్‌జి కృష్ణన్ దర్శకత్వం వహించిన వాస్కోడగామాలో నఖుల్, కెఎస్ రవికుమార్, మునిష్కాంత్, అర్థనా బిను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ ఆవిష్కరించగా ఇది వైరల్ గా దూసుకెళుతోంది.