తెలుగు సినిమా కోసం రాజమౌళి ఫైట్ చేయకపోతే?
ఈరోజు సౌత్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హవా సాగించడానికి కారణం.. బాహుబలితో రాజమౌళి చేసిన అసాధారణ ప్రయత్నమేనని దేవరకొండ అన్నారు.;

విజయ్ దేవరకొండ నటించిన `కింగ్ డమ్` మే లో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీవీ 9 కాన్ క్లేవ్ లో దేవరకొండ మాట్లాడుతూ కొన్ని స్ఫూర్తిదాయకమైన విషయాలను ప్రస్థావించాడు. వేదికపై హోస్ట్ లు అడిగిన ప్రశ్నలకు చకచకా సమాధానాలిచ్చిన దేవరకొండ టాలీవుడ్ దూసుకెళ్లడం వెనక ఒక ముఖ్యమైన కారణాన్ని అందరి దృష్టికి తీసుకుని వచ్చాడు.
ఈరోజు సౌత్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హవా సాగించడానికి కారణం.. బాహుబలితో రాజమౌళి చేసిన అసాధారణ ప్రయత్నమేనని దేవరకొండ అన్నారు. తన పరిశ్రమ కోసం రాజమౌళి చేసిన ఫైట్ ఈ ఎదుగుదలకు కారణమని అన్నాడు. భారీ పెట్టుబడితో ఇద్దరు స్టార్లను ఐదేళ్లు లాక్ చేసి రాజమౌళి బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించారు. ఒకవేళ ఈ సినిమా వర్కవుట్ కాకపోయి ఉంటే, నిర్మాతల పరిస్థితి ఏమయ్యేదో. ఐదేళ్ల పాటు ఏ ఇతర సినిమా చేయని ఆ స్టార్ల కెరీర్ ఎలా ఉండేదో.. సినిమాపై ఆధారపడిన వాటాదారులంతా ఏమయ్యేవారో.. అంటూ విజయ్ ప్రాక్టికల్ గా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వారి స్థలం కోసం ఫైట్ చేయాలి. అలాంటి ఫైట్ టాలీవుడ్ చేసింది గనుకనే ఈ రోజు ఈ స్థాయిని అందుకుందని విశ్లేషించారు.
ఈరోజు తన సినిమాని పాన్ ఇండియాలో విడుదల చేయగలుగుతున్నాను అంటే దానికి కారణం ప్రపంచం చిన్నదిగా మారిపోవడమేనని, భాషా సరిహద్దులు చెగిరిపోయి ఇండియన్ సినిమాగా మారడమేనని దేవర కొండ అన్నారు. ఐదేళ్ల క్రితం ఇలాంటి అవకాశం లేదని అన్నారు. రాబోవు రెండేళ్లలో మరింతగా సినీపరిశ్రమ మారిపోతుందని దేవరకొండ జోశ్యం చెప్పారు. కేవలం సౌత్ నుంచి మాత్రమే కాదు.. ఉత్తరాదిన ఉన్న విభిన్నమైన భాషలు ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన ఫిలింమేకర్స్ పుట్టుకొస్తారని, వారంతా డిఫరెంట్ సినిమాని బాలీవుడ్ కి తెస్తారని కూడా చాలా ముందు చూపుతో విశ్లేషించాడు. మరాఠా సహా ఇతర భాషల నుంచి విలక్షణమైన దర్శకులు పరిశ్రమకు వస్తారని దేవరకొండ అంచనా వేసారు. బాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమాలను తెరకెక్కించిందని, ఇండియన్ డాయాస్పోరాలో అన్నిచోట్లకు హిందీ సినిమా వెళ్లిందని, ఇప్పుడు సౌత్ ఫైట్ చేసి ఈ స్థాయికి ఎదిగిందని దేవరకొండ అన్నారు. ఇటీవల హైదరాబాద్, బొంబాయ్, చెన్నై మధ్య దూరం తగ్గిపోయిందని కూడా వ్యాఖ్యానించారు. అన్ని భాషల స్టార్లు ఒకరితో ఒకరు కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భారతీయ సినిమా డైనమిక్స్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని విశ్లేషించారు. ఓటీటీల రాకతో ప్రతి స్టార్ మారుమూలకు పరిచయమైపోవడం సులువైందని కూడా దేవరకొండ అన్నారు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ హిందీ వెర్షన్ కి రణబీర్ కపూర్ వాయిస్ అందించగా, తమిళ వెర్షన్ కి సూర్య తన వాయిస్ ని అందించి సాయం చేసారు.