దూసుకెళుతున్న బుల్: 6 రోజుల్లో అన్ని లక్షల కోట్ల సంపద

గడిచిన రెండు నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్ పరిణామాల్ని చూసినప్పుడు అనిపించే విషయాలు ఇవే.;

Update: 2025-03-25 04:56 GMT
దూసుకెళుతున్న బుల్: 6 రోజుల్లో అన్ని లక్షల కోట్ల సంపద

స్టాక్ మార్కెట్ సిత్రమే ఇలా ఉంటుంది. అదిగో తోక అంటే అదిగో పులి అంటే వణికిపోవటం.. కాస్త ఊపు వస్తే.. సెంటిమెంట్ మరింత బలోపేతం కావటం మామూలే. బేర్ విధ్వంసం ఎంత భారీగా ఉంటుందో బుల్ దూకుడు అంతే ఎక్కువగా ఉంటుంది. అందుకే.. స్టాక్ మార్కెట్ లో మదుపు చేసే వారు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా.. ఓపిగ్గా.. సహనంతో.. సాంకేతిక అంశాల్ని ప్రాతిపదికగా పెట్టుబడులు పెడితే ప్రయోజనం ఉంటుంది. ఇన్ని లెక్కలు వేసుకొని మదుపు చేసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో తాము మదుపు చేసిన స్టాక్స్ నేలచూపులు చూస్తుంటాయి. అలాంటి సమయంలో కాస్త సహనంతో వెయిట్ చేస్తే.. లాభం ఉంటుంది.

గడిచిన రెండు నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్ పరిణామాల్ని చూసినప్పుడు అనిపించే విషయాలు ఇవే. కొద్ది రోజులగా బేర్ పంజా దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్ చేసిన హాహాకారాలు అన్ని ఇన్ని కావు. అయితే.. ఈ పరిస్థితుల్లో మార్పులు ఖాయమని.. అన్ని రోజులు బేర్ మనేలా ఉండవన్న వాదన మరోసారి నిజమైంది. గడిచిన ఆరు రోజులుగా సాగిన బుల్ దూకుడుతో మార్కెట్ మాంచి ఊపులో ఉంది.

సోమవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ మరో 1078 పాయింట్ల వృద్ధితో 77,984.3 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి ఆరు తర్వాత ఆరు రోజులుగా సాగిన లాభాలతో మార్కెట్ ఆరు వారాల గరిష్ఠ ముగింపును నమోదు చేయటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఈసారి ‘ఆరు’ అంకె అందరిని ఆనందానికి గురి చేస్తుందని చెప్పాలి. నిజానికి సోమవారం సెన్సెక్స్ 1201 పాయింట్ల లాభంతో ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిప్టీ సైతం ఒక దశలో 358.3 పాయింట్లకు ఎగబాకి 23,708.7 ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసినప్పటికి చివర్లో మాత్రం కాస్తంత సర్దుబాటు తప్పలేదు. అయినప్పటికీ.. బుల్ రోజుతో పలువురు ఫోర్ట్ ఫోలియోలు బలంగా మారాయని చెప్పాలి.

విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులతో పాటు బ్యాంకింగ్.. ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు మార్కెట్ ను మరింత దూసుకెళ్లేలా చేశాయి. దీనికి తోడు రూపాయి పుంజుకోవటం మరో సానుకూలాంశంగా చెప్పాలి. రూపాయి బలం కావటంతో సెంటిమెంట్ మరింత పెరిగి మార్కెట్ దూకుడుకు కారణంగా మారిందన్న వాదన మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది.

తాజా దూకుడుతో బీఎస్ ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.27.10 లక్షల కోట్లకు పెరిగి రూ.418.29 లక్షల కోట్లకు చేరుకుంది. ఒక్క సోమవారమే మార్కెట్ సంపద రూ.5లక్షల కోట్లకు పెరిగింది. స్టాక్ మార్కెట్ సూచీలతో పాటు ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి ఈ ఏడాదిలో ఏర్పడిన నష్టాలు పూర్తిగా రికవరీ అయ్యాయి. స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే జవనరిలో 638.44 పాయింట్లు.. ఫిబ్రవరిలో 4302.47 పాయింట్లు నష్టపోగా.. ఈ నెలలో ఇప్పటివరకు 4786.28 పాయింట్లు పుంజుకోవటంతో ఈ ఏడాది నష్టాల నుంచి బయటకు వచ్చినట్లుగా చెప్పాలి.

భయపెట్టిన ట్రంప్ వ్యవహారం ఒక కొలిక్కి రావటం.. ఈ ఏడాదిలో మరో రెండుసార్లు వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వటం.. ట్రంప్ సుంకాల అమలు విషయంలో కాస్త మెత్తబడే వీలు ఉండటంతో పాటు రూపాయి బలోపేతం కావటం లాంటి సానుకూల అంశాలు మార్కెట్ ను టానిక్ గా మారాయి.

Tags:    

Similar News