జనం కోసం కాదు.. మన కోసం-2025
``వాళ్లేదో అనుకుంటారు.. వీళ్లేదో అనుకుంటారు..``- ఇదీ నేటి తరం, యువతరం ఆలోచిస్తున్న వ్యవహారం. ఎవరికోసమో మన జీవితాలను మనం జీవించేస్తున్నాం..
``వాళ్లేదో అనుకుంటారు.. వీళ్లేదో అనుకుంటారు..``- ఇదీ నేటి తరం, యువతరం ఆలోచిస్తున్న వ్యవహారం. ఎవరికోసమో మన జీవితాలను మనం జీవించేస్తున్నాం.. వారెవరో ఏదో అనుకుంటారనో.. వీళ్లెవరో ఏదో అనుకుంటారనో.. మన దైనందిన జీవితాల ను సూత్రంలేని గాలిపటంలా తయారు చేసుకుంటున్నాం. ``జీవితం అంటే ఏమనుకుంటున్నావ్?`` అంటే.. వెంకటచలం ఒక మాటంటారు.. ``మళ్లీ తిరిగి రానిది`` అని! అక్షరాలా నిజం. మరు జన్మ ఉన్నదో లేదో.. అన్నట్టు.. ఉన్నా కూడా మనం మనలాగే పుడతామనే ఖాయం ఏమీ లేదు. సో.. మన కోసం.. మనం జాగ్రత్త పడాల్సిన తరుణం కొత్త సంవత్సరమే!
భావోద్వేగాల అదుపు!
ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదిక వెలువరించింది. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో మరణిస్తున్నవారిలో ఎక్కువ మంది భావోద్వేగాలను అదుపు చేసుకోలేక పోతుండడం వల్లే సంభవిస్తున్నాయని తేల్చి చెప్పింది. రుగ్మతలను దాచుకోవడం.. ఆరో గ్యం పట్ల అశ్రద్ధ. పక్కవారి కోసం.. మనం కొత్త అలవాట్ల దారి పట్టడం వంటివి భావోద్వేగాలపై ప్రభావం చూపుతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఒత్తిళ్లు.. సరికాదని తేల్చి చెప్పింది. భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండడమే ప్రధానమని స్పష్టం చేసింది. అంతేకాదు.. సమస్యలు చిక్కుకున్నప్పుడు.. మనసులో ఉన్న బాధను మానుతో అయినా చెప్పుకోవడమే బెటర్ అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఉత్తమ సలహా!
ఆర్థిక చిక్కులు..
భవిష్యత్తును బంగారు మయంగా ఊహించుకోవడం ప్రతి ఒక్కరికీ పెద్ద చిక్కేంకాదు. కానీ, ఆ ఊహలను సాకారం చేసుకునే ఓర్పు, నేర్పు, ప్రణాళికలే కనిపించడం లేదు. ఖరీదైన బంగ్లాలు.. కార్లు కొనేసి.. అప్పులు చేసేసి స్నేహితుల మెప్పుకోసమే.. కుటుంబంలోని సాటివారి స్థాయితోనో.. పోల్చుకుని పరుగులు పెట్టడం సరికాదని..దేశంలోని ఆర్థిక నిపుణులు కొన్నాళ్లుగా చెబుతూనే ఉన్నాయి. 2024లో క్రెడిట్ కార్డులు వాడేసిన వారు 12 కోట్ల మంది ఉండగా.. వీటిలో 11 కోట్ల మంది క్రెడిట్ కార్డులపై వాడుకున్న సొమ్ముకు రెట్టింపు జరిమానాలు చెల్లించారట. ఇది ఆర్బీఐ లెక్క! సో.. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే.. జేబుకు.. మనకు కూడా ఆదానే కదా! 2025లో ఆదిశగా అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం.
కనీసం ఒక్క బీమా!
దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో చిన్నారులు, యువత, వృద్ధులను తీసేస్తే.. 60 కోట్ల మందికి పైగా సాధారణ పౌరులు ఉన్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న బీమా పాలసీలను అనుసరిస్తున్న వారి సంఖ్య అక్షరాలా 30 కోట్లకు కూడా మించడం లేదని ఇటీవల ఆర్థిక శాఖ వెల్లడించింది. అంటే.. మన జీవితాల తర్వాత.. మనల్ని నమ్ముకున్నవారి జీవితాలకు మనం భరోసా ఇవ్వలేక పోతున్నాం. కాబట్టి ఏదో ఒక్క చిన్న పాలసీ అయినా.. తీసుకునే ప్రయత్నం చేస్తే.. మన తర్వాత.. కూడా మన వాళ్లు ఆనందంగా ఉండేందుకు వేదికలుగా మారొచ్చు! 2025లో ఆదిశగా అడుగులు వేద్దాం.. పక్కవారి కోసం కాకుండా.. మనకోసం జీవిద్దాం!!