ఎన్డీయే కూటమి పవర్ ఫుల్లేనా...జగన్ కి నో చాన్సేనా ?
రాజకీయాల్లో ఎవరికీ తెలియని మ్యాజిక్కులు ఉంటాయి. మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లుగా ఇది పాలిటిక్స్. దీనిని ట్విస్ట్ చేసి పాలిట్రిక్స్ అని కూడా అంటారు.
రాజకీయాల్లో ఎవరికీ తెలియని మ్యాజిక్కులు ఉంటాయి. మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లుగా ఇది పాలిటిక్స్. దీనిని ట్విస్ట్ చేసి పాలిట్రిక్స్ అని కూడా అంటారు. అయితే ఈ ట్విస్టులు ట్రిక్కులు మ్యాజిక్కులు మేథమెటిక్స్ అన్నీ చేసేది తామే అని రాజకీయ పార్టీలు అనుకుంటాయి. కానీ నిజానికి చూస్తే ఇవన్నీ చేసేది ఓట్లు వేసే ఓటర్లు. వారి చేతిలోనే అందరి జాతకాలూ ఉంటాయి.
వారు తలచుకుంటే తిమ్మిని బమ్మిగా చేస్తారు, లేకపోతే తీసి అవతల పడేస్తారు. అయితే గెలిచినపుడు తమ వ్యూహాలు పారాయని ఓడినపుడు బెడిసాయని రాజకీయ పార్టీలు విశ్లేషణ. తనదైన ధోరణిలో సంతృప్తి పడుతూ ఉంటాయి. విషయానికి వస్తే ఏపీలో గత మూడు ఎన్నికలను ఒక్కసారిగా పరిశీలించుకుంటే జనాలు కోరి గెలిపించిన పార్టీలకే అందలాలు దక్కాయి. అంతే తప్ప ఎత్తులు పొత్తులు జిత్తులు ఇవన్నీ ఆ తర్వాత మాటే అని అర్ధమవుతుంది.
ఇక 2014లో చూసుకుంటే బీజేపీ టీడీపీల మధ్య పొత్తు ఉంది. జనసేన మద్దతు ఇచ్చింది. దాంతో ఆ పొత్తు ఫలించింది అన్నది ఒక విశ్లేషణ. నిజానికి దీని కంటే కూడా మరో ఫ్యాక్టరే ఆ ఎన్నికల్లో పనిచేసిందని చెప్పాలి. కేంద్రంలో ఫ్రెష్ లుక్ గా నరేంద్ర మోడీ కనిపించారు. ఏపీలో అడ్డగోలు విభజనతో అల్లాడుతున్న జనాలకు సైబరాబాద్ సృష్టికర్తగా బాబు కనిపించారు. పవన్ పొలిటికల్ ఎంట్రీ కూడా దానికి ఊతమిచ్చింది. అలా అప్పట్లో ఈ కాంబో సూపర్ హిట్ అయింది అన్న విశ్లేషణ నాణానికి రెండో వైపుగా ఉంది.
ఇక 2019లో తీసుకుంటే యాంటీ ఇంకెంబెన్సీ ఓట్లు ఎంత చీలితే అంత లాభమని టీడీపీ అధినాయకత్వం భావించింది. జనసేన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని వేరేగా బరిలోకి దిగింది. బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. వైసీపీ తానుగా సింగిల్ గా బరిలోకి దిగింది. న్యాయంగా చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు దారుణంగా చీలి టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలి. కానీ వైసీపీ ఇక్కడ గెలిచింది. దానికి కారణం జగన్ ఫ్రెష్ లుక్ తో కనిపించారు. ఆయనను సీఎం గా చూడాలన్న బలమైన ఆకాంక్ష ముందు ఈ ఎత్తులేవీ పనిచేయలేదు. దాంతో 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారు అని చెప్పాల్సి ఉంది.
ఇక ఇంకో వైపు చూస్తే కనుక టీడీపీని పక్కన పెట్టాలని జనాలు అనుకున్నారు. అందుకే 23 సీట్లతో సరిపెట్టారు. ఈ రెండు పార్టీల మధ్య పోరులో జనసేనకు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే పవన్ కి రెండు సీట్లలోనూ పరాజయం తప్పింది కాదు. ఇక్కడ చూస్తే జనాల ఆకాంక్షల ముందు ఏ రకమైన స్ట్రాటజీస్ పని చేయలేదు అన్నది అర్ధమవుతుంది.
కట్ చేస్తే 2024 ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పవన్ ఒక కీలకమైన ఫ్యాక్టర్ గా ఉన్నారు అన్నది చెప్పుకోవాలి. ఒకసారి బాబు మరోసారి జగన్ ని చూసిన వారికి ఈసారి బాబుతో కలసి కూటమి కట్టిన పవన్ కి రాజకీయ సిరి అందించాలని అనుకున్నారు. అలా పవన్ కి అధికార వాటా దక్కితే చూడాలని అనుకున్నారు. దాంతో జనం మళ్ళీ ఏకపక్ష తీర్పుని ఇచ్చారు. ఈ దెబ్బకు 11 సీట్లకు వైసీపీ కుదేల్ కాగా 164 సీట్లతో టీడీపీ కూటమి విజయఢంకా మోగించింది.
ఇపుడు 2029 ఎన్నికల గురించి ముందుగానే ఒక విశ్లేషణ చేసుకుంటే ఎన్డీయే కూటమి కలసికట్టుగా అప్పుడు పోటీ చేస్తే ఈ విజయం దక్కుతుందా అంటే అంటే ఆనాటికి అనేక సమీకరణలు మారవచ్చు అని అంటున్నారు కేంద్రంలో నాలుగవ సారి బీజేపీకి అధికారం అంటే యాంటీ ఇంకెంబెన్సీ భారీగా ఉండవచ్చు. అలాగే ఏపీలో అయిదేళ్ళ కూటమి పాలన యాంటీ ఇంకెంబెన్సీ కి దారి తీయవచ్చు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ అధికారం అనుభవించారు కనుక ఆయన ఫ్రెష్ లుక్ కాకపోవచ్చు.
చంద్రబాబుని ఓడిస్తూ క్షమిస్తూ వస్తున్న తీరులోనే జగన్ ని జనాలు క్షమించి మరో చాన్స్ ఇవ్వవచ్చు. అలా జగన్ ని అయిదేళ్ళు దూరంగా పెట్టాం కాబట్టి ఆయన మారిన మనిషి అని భావిస్తే కనుక 2029లో ఏకపక్ష తీర్పు వైసీపీకి అనుకూలంగానూ రావచ్చు. అపుడు ఎన్డీయే కూటమి కట్టినా చిత్తు కావచ్చు.
జనసేనకు పవన్ కి రాజకీయ చోదక శక్తిగా ఉన్న బలమైన సామాజిక వర్గం ఆలోచనలు మారనూ వచ్చు. ఇలా ఎన్నో జరగవచ్చు. ఇవన్నీ జనాల చేతిలో ఉన్న విషయాలు. పొత్తులు కడితే గెలుస్తామన్న కచ్చితమైన మేథమెటిక్స్ ఎపుడూ పారదు. యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ని ఓడించాలనుకుని కాంగ్రెస్ ఎస్పీ వంటి పార్టీలు జట్టు కట్టినా ఫెయిల్ అయి యోగీ గెలిచారు అన్నది గుర్తు చేసుకోవాలి.
ప్రజలలో బలమైన ఆకాంక్షలే ఎపుడూ ఫలితాలను నిర్ణయిస్తాయి తప్ప పొత్తులు కావు. మరి అసెంబ్లీలో పవన్ ఎన్డీయే పొత్తు పదిహేనేళ్ళు ఉంటుంది వైసీపీకి నో చాన్స్ అన్న ప్రకటనలు చూస్తే కనుక అది అలా జరుగుతుందా అంటే రాజకీయాల్లో రెండూ రెండూ నాలుగు ఎపుడూ కాదు అన్నది కూడా ఉంటుంది. సో ప్రతీ ఎన్నికా ఒక సవాలే. ప్రతీ ఫలితమూ ఒక జవాబే అన్నది అంతా గుర్తుంచుకోవాలి. దేనికీ మరో దానితో పోలిక పెట్టడం అన్నదే రాజకీయాల్లో కుదరని పని అన్నదే కఠిమైన విశ్లేషణ.