భద్రాచలం.. 9 ఏళ్ల తర్వాత రేవంత్ వల్ల మొదలైన సంప్రదాయం
ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం చేరుకుని శ్రీరామునికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.;

తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు శ్రీరాముని జన్మదినాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ శుభ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 ఏళ్ల తర్వాత ఒక సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోశారు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీ. అయితే 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఆ ఏడాది ఆయన స్వయంగా భద్రాచలం వెళ్లి రాములోరికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కానీ ఆ తర్వాత ఈ సంప్రదాయం నిలిచిపోయింది.
మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం చేరుకుని శ్రీరామునికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
తెలంగాణలో చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన భద్రాచలం రామాలయానికి రేవంత్ రెడ్డి సానుకూల దృక్పథంతో మళ్లీ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. భక్తులు, ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతుండగా, ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి రాములోరికి కానుకలు సమర్పించడం ఈ వేడుకలకు మరింత శోభను చేకూర్చింది. ఈ చర్య భక్తుల్లో మరింత భక్తి భావాన్ని నింపిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.