ఒకరికి మించి మరొకరు.. ఈసారి అల్లుడికి 470 రకాలు

తాజా ఉదంతం ఆ కోవలోకే. మర్యాదలకు పెట్టింది పేరైన గోదారోళ్లు.. తమ ఇంటికి వచ్చే కొత్త అల్లుడికి భారీగా విందును ఏర్పాటు చేయటం తెలిసిందే.

Update: 2025-01-14 05:10 GMT

వినూత్నంగా ఉండేందుకు ఎవరో ఒకరు మొదలు పెట్టే పనులు.. కాల క్రమంలో అదో ట్రెండ్ గా మారటమే కాదు.. చూసినంతనే అతిగా అనిపించేలా పరిస్థితులు మారుతుంటాయి. తాజా ఉదంతం ఆ కోవలోకే. మర్యాదలకు పెట్టింది పేరైన గోదారోళ్లు.. తమ ఇంటికి వచ్చే కొత్త అల్లుడికి భారీగా విందును ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం వంద రకాలకు పైనే వంటల్ని స్వయంగా వండి పెట్టి.. విందును ఏర్పాటు చేసిన వైనం ఫోటోలు.. వీడియోల రూపంలో వైరల్ కావటం.. అందరూ ఆసక్తిగా మాట్లాడుకోవటంతోపాటు.. వారి మర్యాదలు ఉభయ రాష్ట్రాల్లో హాట్ న్యూస్ గా మారింది.

కట్ చేస్తే.. అప్పటి నుంచి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ.. అంతకుమించి అన్నట్లుగా సంక్రాంతి అల్లుడికి భారీ ఎత్తున విందు సిద్ధం చేసే కార్యక్రమానికి తెర తీశారు. చూస్తుండగానే వంద వంటలు కాస్తా.. 200 వంటకాలు.. పిండి వంటల్ని సిద్ధం చేసి వడ్డించేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ కు చెందిన కుటుంబం సైతం గోదావరి జిల్లా అల్లుడికి 170రకాల పిండి వంటలు చేసి విందు చేసిన వైనం వెలుగు చూసింది.

ఇలాంటి వాటికి మించినట్లుగా ఒక భారీ సంక్రాంతి విందు వెలుగు చూసింది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కొత్త అల్లుడికి సంక్రాంతి సందర్భంగా మెగా విందును సిద్ధం చేశారు. ఇందుకోసం ఏకంగా 470 రకాల వంటకాల్ని సిద్ధం చేశారు. యానం వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్.. వేంకటేశ్వరిల రెండో కుమార్తె హరిణ్యకు గత ఏడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్ తో పెళ్లైంది.

మొదటి సంక్రాంతి పండక్కి ప్రత్యేకంగా ఆహ్వానించిన వారు.. అల్లుడికి అదిరేలా మెగా విందును సిద్ధం చేశారు. ఫ్యూర్ వెజిటేరియన్ అయిన వారు.. వెజ్ ఫుడ్ తో పాటు.. పిండి వంటలు.. స్వీట్లు.. ఫ్రూట్స్.. డ్రై ఫ్రూట్స్.. కూల్ డ్రింక్స్ తో పాటు దాదాపు 470 రకాల వెరైటీలను విందులో భాగంగా వడ్డించారు. ఈ మెగా విందులో వడ్డించిన వంటకాల్ని చూసిన వారంతా ఔరా అనుకుంటున్న పరిస్థితి. మరి.. అల్లుడు ఎంత ఆనందానికి గురై ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. అయితే.. ఇంత భారీ విందు వేళ ఒక విమర్శను ఎదుర్కొంటున్నారు. డబ్బులున్నాయి కదా అని.. నెంబర్ గేమ్ లో భాగంగా భారీగా కొనేసి.. ఏర్పాటు చేసే కన్నా.. వడ్డించేవన్నీ స్వయంగా వండి చేస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. నిజమే కదా?

Tags:    

Similar News