ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు వైద్య పరీక్షలు
పవన్ హాస్పిటల్ కు వెళ్లి టెస్టులు చేయించుకుంటున్న ఫోటోలను కూడా జనసేన పార్టీ షేర్ చేసింది.
ఓ వైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలతో ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా చాలా బిజీగా ఉన్నారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్లే ఆయన చేయాల్సిన సినిమాలు సైతం చాలా లేటవుతున్నాయి. నిర్మాతలు కూడా ఏమీ చేసేది లేక పవర్ స్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు.
రెస్ట్ లేకుండా తిరగడం వల్ల పవన్ వెన్ను నొప్పితో బాధ పడుతున్నారని అన్నారు. రీసెంట్ గా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్న టైమ్ లో కూడా పవన్ అక్కడి ఆయుర్వేద వైద్యుల సూచనలు తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా పవన్ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
చెకప్ లో భాగంగా వైద్యులు పవన్ కు స్కానింగ్ తో పాటూ మరికొన్ని టెస్టులు చేశారు. రిపోర్టులను పరిశీలించిన డాక్టర్లు ఆయనకు కొన్ని సూచనలు చేశారని, మరికొన్ని టెస్టులు అవసరముండగా ఈ నెలాఖరున లేదా మార్చి ఫస్ట్ వీక్ లో మళ్లీ పవన్ ను రమ్మని డాక్టర్లు చెప్పినట్టు జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేసింది.
పవన్ హాస్పిటల్ కు వెళ్లి టెస్టులు చేయించుకుంటున్న ఫోటోలను కూడా జనసేన పార్టీ షేర్ చేసింది. ఈ నెల 24 నుంచి మొదలవనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా పవన్ పాల్గొననున్నట్టు జనసేన పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం పవన్ అధ్యక్షతన జనసేన శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ కానున్నారు. బడ్జెట్‌పై మంత్రులపై అవగాహన కల్పించడంపై ఎమ్మెల్యేలకు పవన్ పలు సూచనలు ఇవ్వనున్నారు.