ధోని మీద మీమ్స్ మోత

బ్యాటింగ్ ఆర్డర్లో మరీ దిగువన వస్తున్న ధోని.. వేగంగా ఆడలేక ఇబ్బంది పడడం కొన్ని సీజన్ల నుంచి చూస్తున్నాం.;

Update: 2025-03-29 12:26 GMT
ధోని మీద మీమ్స్ మోత

ఐపీఎల్ వచ్చిందంటే అందరి దృష్టిని ఆకర్షించే ఆటగాళ్లలో ధోని ఒకడు. చెన్నై ఫ్రాంఛైజీ ఆకర్షణ అంతా అతడితోనే ముడిపడి ఉంది. చెన్నై మీద నిషేధం పడ్డ రెండేళ్లు మినహాయిస్తే ఐపీఎల్ ఆరంభం నుంచి అదే జట్టుతో కొనసాగుతున్నాడు ఈ లెజెండరీ క్రికెటర్. కొన్నేళ్ల నుంచి తన రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతోంది కానీ.. ఫిట్నెస్‌ కాపాడుకుంటూ ఒక్కో సీజన్ పొడిగించుకుంటూ వస్తున్నాడు మహి.

ఐతే వికెట్ కీపర్‌గా ఇప్పటికీ అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ.. ధోని బ్యాటింగ్ మాత్రం అంచనాలకు తగ్గట్లు సాగట్లేదు. బ్యాటింగ్ ఆర్డర్లో మరీ దిగువన వస్తున్న ధోని.. వేగంగా ఆడలేక ఇబ్బంది పడడం కొన్ని సీజన్ల నుంచి చూస్తున్నాం. చాలా మ్యాచ్‌ల్లో విజయానికి అవకాశాలున్నపుడు బ్యాటింగ్‌కు దిగకపోవడం, ఓటమి ఖరారయ్యాక వచ్చి షాట్లు ఆడడం ద్వారా ధోని ట్రోల్స్‌కు అవకాశం ఇస్తున్నాడు.

శనివారం రాత్రి బెంగళూరుతో మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. చెన్నై ముందు 197 పరుగుల లక్ష్యం నిలవగా.. 80 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది చెన్నై. కానీ ఆ స్థితిలో ధోని రావాల్సింది పోయి ఎనిమిదో స్థానంలో బౌలరైన అశ్విన్‌ను పంపించారు. అశ్విన్ కూడా ఔటయ్యాక 17వ ఓవర్లో కానీ ధోని బ్యాటింగ్‌కు రాలేదు. అప్పటికి చెన్నై 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సి వచ్చింది. విజయావకాశాలు లేని స్థితిలో ధోని కొన్ని షాట్లు ఆడాడు. ఆ షాట్లు ఎందుకూ కొరగాకుండా పోయాయి.

విజయావకాశాలు ఉన్నపుడు బౌలర్లను పంపి, మ్యాచ్ చేజారాక వచ్చి ఇలా షాట్లు ఆడడం ఏంటి అంటూ ధోని మీద ట్రోల్స్ ఒక రేంజిలో జరుగుతున్నాయి. అతడి మీద దారుణమైన మీమ్స్ కనిపిస్తున్నాయి. చెన్నై అభిమానులే ఈ విషయంలో ధోనీని విమర్శిస్తుండగా.. వేరే జట్ల అభిమానులైతే ధోనీని మామూలుగా టార్గెట్ చేయట్లేదు. చెన్నైలో 17 ఏళ్ల తర్వాత బెంగళూరు గెలిచిన నేపథ్యంలో ఇన్నాళ్లూ సీఎస్కే ఫ్యాన్స్ నుంచి ఎగతాళికి గురైన ఆర్సీబీ, కోహ్లి ఫ్యాన్స్ అయితే నిన్న రాత్రి నుంచి రెచ్చిపోతున్నారు. ఓవైపు చెన్నైని, ఇంకోవైపు ధోనీని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడేసుకుంటున్నారు.

Tags:    

Similar News