కేఎల్ (కాంతారా లోకేశ్) రాహుల్.. ఆట మార్చిన టీమ్ ఇండియా స్టార్

కన్నూర్ లోకేశ్ రాహుల్ (కేఎల్ రాహుల్).. దాదాపు 11 ఏళ్లుగా టీమ్ ఇండియాలో భాగం.. 1 నుంచి 6వ స్థానం వరకు బ్యాటింగ్ కు దిగాడు.. అవసరం కొద్దీ వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు.;

Update: 2025-04-12 08:40 GMT
"KL Rahul’s Redemption: From Criticism to Comeback Star"

కన్నూర్ లోకేశ్ రాహుల్ (కేఎల్ రాహుల్).. దాదాపు 11 ఏళ్లుగా టీమ్ ఇండియాలో భాగం.. 1 నుంచి 6వ స్థానం వరకు బ్యాటింగ్ కు దిగాడు.. అవసరం కొద్దీ వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. టి20లు, వన్డేలు, టెస్టులు.. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు కొట్టిన కొద్దిమంది భారత క్రికెటర్లలో ఒకడు..

కెరీర్ మొదట్లోనే దూకుడైన బ్యాటింగ్ తో టి20ల్లో రాణించాడు.. వన్డేల్లో వరుసగా హాఫ్ సెంచరీలు సాధించాడు.. టెస్టుల్లోనూ ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్ వరకు ఆడాడు.. కానీ, అతడు మేటి బ్యాట్స్ మన్ గా.. మ్యాచ్ విన్నర్ గా మాత్రం పేరు తెచ్చుకోలేకపోయాడు..

మంచి ఫామ్ లో ఉండగా గాయాలు.. అంచనాలు పెట్టుకున్నప్పుడు విఫలం కావడం.. జట్టు అవసరాలకు తగ్గట్లుగా ఆడలేకపోవడం.. గెలిపించాల్సిన స్థితిలో చేతులెత్తేయడం.. ఇవీ రాహుల్ కు రావాల్సిన పేరును రాకుండా చేశాయి.

టెస్టు జట్టులో ఉన్నా లేనట్లే.. టి20లకు పరిగణించడమే మానేశారు.. వన్డేల్లోనూ చోటు కష్టమే.. ఇదీ మొన్నటివరకు రాహుల్ పరిస్థితి. ఇప్పుడు మాత్రం రాహుల్ టైమ్ నడుస్తోంది.. ఇంగ్లండ్ తో సిరీస్ లొ తుదిజట్టులో చోటును సద్వినియోగం చేసుకోవడం.. చాంపియన్స్ ట్రోఫీలో రిషభ్ పంత్ ను పక్కనపెట్టి మరీ చాన్సిచ్చేలా చేసింది.. ఆ టోర్నీలో టీమ్ ఇండియా తరఫున ఫినిషర్ పాత్ర పోషించడం.. జట్టు కూడా టైటిల్ సాధించడంతో రాహుల్ పేరు మార్మోగింది.

ఇప్పుడు కేఎల్ రాహుల్ ఢిల్లీ తరఫున దుమ్ము లేపుతున్నాడు. మంచి హైట్.. ఎలిగెంట్ బ్యాటింగ్ స్టయిల్ ఉన్న రాహుల్ కు ఇన్నేళ్లలో రాని పేరు ఇప్పుడు వస్తోంది.

కెరీర్ మొదట్లో రాహుల్ టి20ల్లోనూ దూకుడుగానే ఆడాడు. అయితే, తర్వాత నెమ్మదించడంతో టి20లకు అతడి బ్యాటింగ్ తీరు సరిపోదనే పేరు వచ్చింది. క్రికెటింగ్ షాట్లతో ఇన్నింగ్స్ నిర్మించే రాహుల్ ను టీమ్ ఇండియా టి20 జట్టుకు ఎంపిక చేయడం లేదు. అయితే, ఇకమీదట మాత్రం అతడికి టీమ్ ఇండియా టి20 జట్టులో చోటు ఖాయం అనిచెప్పొచ్చు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్థిరంగా ఆడే రాహుల్.. తన జట్టుకు మాత్రం టైటిల్ అందించలేడనే పేరు తెచ్చుకున్నాడు. గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ ఎస్ జీ) కెప్టెన్ గా ఉంటూ.. ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో మాటలు పడ్డ రాహుల్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ కు సాధారణ ఆటగాడిగా సేవలందిస్తున్నాడు.

ఈ ఏడాది రాహుల్ గేమ్ మొత్తం మారిపోయింది. దూకుడుకు దూకుడు.. టెక్నిక్ కు టెక్నిక్.. మొత్తానికి అచ్చమైన టి20 బ్యాటర్ లా చెలరేగిపోతున్నాడు.

సొంతగడ్డ బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై జరిగిన మ్యాచ్ లో రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ ను ఎవరూ మర్చిపోలేరు. 160 పైగా లక్ష్య ఛేదనలో 60 పరుగులకే నాలుగు వికెట్లు పడిపోయిన స్థితిలో వచ్చిన రాహుల్.. 53 బంతుల్లోనే 93 పరుగులు (175 స్ట్రయిక్ రేట్) చేసి నాటౌట్ గా నిలిచాడు. సిక్సర్ తో జట్టును గెలిపించాడు. చివరి 64 పరుగులను 24 బంతుల్లోనే చేశాడు.

మూడు మ్యాచ్ లలో రెండు హాఫ్ సెంచరీలు చేసిన రాహుల్.. ఢిల్లీకి తొలిసారి టైటిల్ అందించే చాన్సుంది.

అతడి వెనుక కాంతారా..

కేఎల్ రాహుల్ సొంత రాష్ట్రం కర్ణాటక. కానీ, అతడు బెంగళూరుకు ఆడింది తక్కువే. తాజాగా ఆర్సీబీపై గెలిపించిన అనంతరం రాహుల్ సూపర్ హిట్ సినిమా ’కాంతారా’ క్లైమాక్స్ లో హీరో రిషభ్ శెట్టి తరహాలో సంబరాలు చేసుకున్నాడు. రిషభ్.. కత్తిని నేలపై తిప్పుడూ.. ఇది మా గడ్డ అని గుండెలపై చరుచుకుని చెబుతాడు. కత్తిని నేలపై గుచ్చుతాడు. రాహుల్ కూడా బ్యాట్ ను అచ్చు అలానే చేసి.. చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాంతార తనకెంతో ఇష్టమైన సినిమా అని.. బెంగళూరులో పుట్టి పెరిగానని.. చిన్నస్వామి మైదానంలో ఎలా ఆడాలో తనకు తెలుసంటూ రాహుల్ తర్వాత తెలిపాడు.

Tags:    

Similar News