6 బంతుల్లో 6 సిక్సులు.. చెన్నైపై సెంచరీతో పిడుగు.. ఎవరీ ప్రియాంశ్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం ఇప్పటివరకు 6 బంతుల్లో 6 సిక్సులు రికార్డు నమోదవలేదు.;

30 ఏళ్ల కిందట వరకు ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టడం అంటే ప్రపంచ క్రికెట్లో ఒక వితం.. దీనిని భారత మాజీ ఆల్ రౌండర్ రవిశాస్త్రి తొలిసారిగా సాధ్యం చేశాడు. అయితే, అది దేశవాళీ క్రికెట్ లో. మళ్లీ అంతర్జాతీయంగా చూస్తే టీమ్ ఇండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షలె గిబ్స్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి ఔరా అనిపించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం ఇప్పటివరకు 6 బంతుల్లో 6 సిక్సులు రికార్డు నమోదవలేదు. కానీ, ఐపీఎల్ స్ఫూర్తిగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న లీగ్ లలో మాత్రం ఓ కుర్రాడు అదరగొట్టాడు. ఆరు బంతులను ఆరుసార్లు బౌండరీ దాటించి ఐపీఎల్ ఫ్రాంచైజీల ఫోకస్ లో పడ్డాడు.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్).. ఐపీఎల్ తరహాలో లోకల్ లీగ్. దీంట్లో అదరగొట్టిన ప్రియాంశ్ ఆర్యను రూ.3.80 కోట్లకు గత ఏడాది మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అంతేకాదు.. ప్రియాంశ్ ను ఓపెనర్ గానూ దింపి మంచి అవకాశం ఇచ్చింది.
మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్టుతో మ్యాచ్.. 8 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయింది పంజాబ్.. కానీ, ఆ జట్టును నిలబెట్టాడు ప్రియాంశ్ ఆర్య. శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్ వెల్ వంటి బ్యాటర్లు ఔటైనా ప్రియాంశ్ మాత్రం నిబ్బరంగా నిలిచాడు. ఖలీల్ అహ్మద్, మతీశా పతిరన, నూర్ అహ్మద్, అశ్విన్, జడేజా వంటి మేటి బౌలర్లను దీటుగా ఎదుర్కొని సిక్స్ లు, ఫోర్ల మోత మోగించాడు.
39 బంతుల్లోనే సెంచరీ కొట్టిన ప్రియాంశ్.. మొత్తం 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్ లతో 103 పరుగులు చేశాడు. ఏమాత్రం అవకాశం దొరికినా యార్కర్లతో కాళ్లను విరిచేసే పతిరన బౌలింగ్ లోనే ప్రియాంశ్ హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టడం విశేషం.
యూపీలోని ఫతేహ్ నగర్ లో 2001లో పుట్టాడు ప్రియాంశ్. ఇతడి తల్లిదండ్రులు ఢిల్లీలో ఉపాధ్యాయులు. అందుకని దేశవాళీల్లో ఢిల్లీకి ఆడాడు. 2021/22 సీజన్ లో అరంగేట్రం చేశాడు. ఏడు లిస్ట్ - ఎ మ్యాచ్ లలో 77 పరుగులు, 22 టి20 మ్యాచ్ లలో 731 పరుగులు చేశాడు.
దేశవాళీ రికార్డులు గొప్పగా లేకున్నా.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఓల్డ్ ఢిల్లీ జట్టుపై 30 బంతుల్లో 57 పరుగులు, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ పై 51 బంతుల్లో 82 పరుగులు బాదడంతో ప్రియాంశ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టి నార్త్ ఢిల్లీ స్ట్రైకర్ పై 50 బంతుల్లోనే 120 పరుగులు చేయడంతో ప్రియాంశ్ అందరి దృష్టి ఆకర్షించాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సొంత రాష్ట్ర యూపీపై సెంచరీ (102)తో ప్రియాంశ్ కు పేరొచ్చింది. ఈ మొత్తం ఎక్కువే అని అందరూ అనుకున్నా.. ఐపీఎల్ తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై 22 బంతుల్లో 47 పరుగులు కొట్టి తన ధరకు న్యాయం చేశాడు. తర్వాత రెండు మ్యాచ్ లలో (8, 0) విఫలమైనా.. చెన్నైపై దారుణంగా ఓడే పరిస్థితుల్లో అద్భుత సెంచరీ కొట్టి తనకు తిరుగులేదని చాటాడు. ఐపీఎల్ లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు.