భారతీయుల ఇళ్లలో 10 దేశాల్ని మింగేసేంత బంగారం నిల్వలు
ఎవరి ఒంటిపై ఎంత బంగారం ఉంది? ఇంట్లో ఎంత పెద్దగా నిల్వలు ఉన్నాయి? అనేది హోదాను, పొదుపును, ముందస్తు జాగ్రత్తను సూచిస్తుంది;

భారతదేశంలో ప్రతి కుటుంబం బంగారం కొనుగోళ్లకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. ఎవరి ఒంటిపై ఎంత బంగారం ఉంది? ఇంట్లో ఎంత పెద్దగా నిల్వలు ఉన్నాయి? అనేది హోదాను, పొదుపును, ముందస్తు జాగ్రత్తను సూచిస్తుంది. ఎన్‌ఫోర్స్ మెంట్ (ఈడీ) అధికారులు గోడలు బద్ధలు కొట్టి, బాత్రూములు, బెడ్ రూమ్ లు వెతికినప్పుడు గుట్టలుగా నగలు, ఆభరణాలు బయటపడిన సందర్భాలు అనేకం. బంగారం అంటే భారతీయులకు అంత పిచ్చి.
తాజాగా HSBC అందించిన సర్వే వివరాల ప్రకారం.. భారతదేశంలోని గృహ బంగారం నిల్వలు 25,000 టన్నులకు చేరుకున్నాయని, ఇది ప్రపంచంలోని టాప్ 10 కేంద్ర బ్యాంకుల మొత్తం నిల్వలను అధిగమించిందని అంచనా. సంపదలో భాగంగా బంగారంపై భారతీయుల జాగ్రత్త దీనికి కారణం. దేశంలో మునీశ్వరుల కాలం నుంచి, రాజులు చక్రవర్తుల కాలం నుంచి శతాబ్ధాలకుగా పాతుకుపోయిన కల్చర్ ఇది. ఆర్థికంగాను బంగారంపై భారతీయులు ఎక్కువగా ఆధారపడతారు. బంగారం తక్షణ ధన అవసరాలు తీర్చే కామధేనువు.
యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, ఇండియా, జపాన్, టర్కీ (వీటి కేంద్ర బ్యాంకుల్లోని నిల్వలు) దేశాలన్నిటి బంగారం నిల్వల్ని కలిపి చూసినా.. భారతీయ గృహాల్లో ఈ నిల్వలు అధికమని హెచ్.ఎస్.బి.సి సర్వే నివేదించింది. ఈ దేశాల్లో భారతీయ గృహస్తుల బంగారం నిల్వల కంటే తక్కువ బంగారాన్ని కలిగి ఉన్నాయి. దీనిని బట్టి మన భారతీయులకు పొదుపు ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని పొదుపు, పెట్టుబడి వ్యూహాలలో బంగారం ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉందో దీనిని బట్టి అంచనా వేయొచ్చు.
ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ హెచ్చుతగ్గుల క్లిష్ఠ సమయాల్లోను బంగారం కుటుంబాన్ని ఆదుకుంటుందన్నది దేశంలోని ప్రజల నమ్మిక. భారతీయ కుటుంబాలకు బంగారం చారిత్రాత్మకంగా ప్రాధాన్యత కలిగిన ఆస్తి. వివాహాలు, పండుగలు, మతపరమైన వేడుకలు బంగారం కొనుగోళ్ల డిమాండ్‌ను పెంచుతాయి. గ్రామీణ కుటుంబాలు తరచుగా బ్యాంకింగ్ ఆస్తులకు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని ఉపయోగిస్తాయి.
బంగారం ధరలలో ప్రపంచ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. కుటుంబాలు, ప్రైవేట్ యాజమాన్యం భారతదేశంలో ముందంజలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి సంవత్సరాలలో బంగారం కొనుగోళ్లను పెంచాయి. ఆర్థిక అస్థిరత నుండి రక్షణగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని చూసే ప్రపంచ ధోరణికి అనుగుణంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన బంగారు నిల్వలను క్రమంగా పెంచుకుంది.