విదేశాల్లో స్థిరపడేందుకు తరలిపోతున్న భారత సంపన్నులు.. కారణమిదే
ఈ వలసలను నడిపిస్తున్న ప్రాథమిక అంశాలలో ఒకటి భారతదేశ విద్యా వ్యవస్థపై ఉన్న అసంతృప్తి.;

భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒక ముఖ్యమైన ధోరణి కనిపిస్తోంది. ₹25 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన ప్రతి ఐదుగురిలో ఒకరు విదేశాలలో స్థిరపడటానికి మొగ్గు చూపుతున్నారు. ఈ వలసలకు గల కారణాలు చూస్తే.. మన దేశంలో పన్ను విధానాలు, మౌలిక సదుపాయాల సమస్యల కొరత ఉండడంతోపాటు మెరుగైన విద్య, రోటీన్ జీవితం నుంచి మార్పుకోరుకోవడం.. మొత్తం మీద మెరుగైన జీవన నాణ్యత వరకు అనేక అంశాలు విదేశాలకు వెళ్లడానికి దోహదపడుతున్నాయి.
ఈ వలసలను నడిపిస్తున్న ప్రాథమిక అంశాలలో ఒకటి భారతదేశ విద్యా వ్యవస్థపై ఉన్న అసంతృప్తి. ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య వేగంగా పెరగడం వల్ల గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరిగింది. అయితే వారి నాణ్యతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని డీమ్డ్ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు బకాయిలు ఉన్నప్పటికీ డబ్బు తీసుకుని పాస్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల గ్రాడ్యుయేట్లలో సాంకేతిక.. సాఫ్ట్ నైపుణ్యాల కొరత ఏర్పడుతోంది.
ఈ పరిస్థితి యువ తల్లిదండ్రులను కలవరపెడుతోంది. వారు తమ పిల్లల కోసం బలమైన విద్యా విధానాన్ని కోరుకుంటున్నారు. ఇది వారిని ఉన్నతమైన విద్యా సంస్థలు ఉన్న దేశాలకు వెళ్లమని ప్రేరేపిస్తోంది.
యువ జంటలు , మధ్య వయస్కులు ఈ వలసలను నడిపిస్తుండగా, వృద్ధ తరం మాత్రం ఇక్కడే ఇండియాలో ఉండటానికి ఇష్టపడుతోంది.
వారి అయిష్టానికి ప్రధాన కారణం భారతదేశంలోని అందుబాటులోని సరసమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ. అగ్రశ్రేణి ఆసుపత్రులు, ఇంటి వైద్య సహాయం.. తక్కువ ఖర్చుతో కూడిన చికిత్సలు సీనియర్ సిటిజన్లు వదులుకోలేని ముఖ్యమైన ప్రయోజనాలుగా ఉన్నాయి.
మౌలిక సదుపాయాల విషయానికి వస్తే.. భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు.. రింగ్ రోడ్లను కలిగి ఉన్నప్పటికీ పట్టణ మౌలిక సదుపాయాలు ప్రధాన సమస్యగా ఉన్నాయి.
నగర రోడ్లు తరచుగా రద్దీగా ఉంటాయి. ట్రాఫిక్ సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. ఇది రోజువారీ ప్రయాణాన్ని సవాలుగా మారుస్తుంది. ఈ పట్టణ గందరగోళం, కాలుష్యం , అసహ్యకరమైన జీవన వాతావరణం కారణంగా సంపన్నులు మెరుగైన జీవన నాణ్యత కోసం విదేశాలకు వెళ్లడానికి మరొక కారణంగా నిలుస్తోంది..
ఈ ఒత్తిడి , విదేశాల్లోని నాణ్యమైన ఆకర్షణీయమైన అంశాల వల్ల భారతదేశంలోని సంపన్నులు విదేశాలకు వలస వెళ్లే ధోరణి పెరుగుతూనే ఉంది. ఇది మన దేశంలో పరిష్కరించాల్సిన వ్యవస్థాగత సవాళ్లను ఎత్తిచూపిస్తోంది.