జలియన్ వాలాబాగ్ పై బ్రిటన్ మొసలి కన్నీరు కారుస్తుందా?

ఈ దారుణాన్ని బ్రిటన్ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ తాజాగా ఆ దేశ పార్లమెంటులో గుర్తు చేశారు.;

Update: 2025-03-29 11:41 GMT
జలియన్ వాలాబాగ్ పై బ్రిటన్ మొసలి కన్నీరు కారుస్తుందా?

ఆనాటి మారణ హోమాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు.. చెప్పేందుకు నోరు రాదు.. అమాయకులు.. పసిపిల్లలతో వచ్చిన మహిళలు.. తలుపులు మూసేసి.. ఎవరూ పారిపోకుండా చేసి.. బ్రిటిష్ అధికారి జరిపిన మారణకాండ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇది జరిగి 105 ఏళ్లు.. వచ్చే ఏప్రిల్ కు 106 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో బ్రిటన్ ఎంపీ ఓ అనూహ్య ప్రతిపాదన చేశారు.

జలియన్ వాలాబాగ్.. 1919 ఏప్రిల్ 13.. ఎర్రటి ఎండ.. వేలమంది అక్కడ సమావేశం అయ్యారు. ఇదే సమయంలో బ్రిటిష్ పోలీసులు జనరల్ డయ్యర్ సారథ్యంలో మారణకాండకు దిగారు. దీంతో 1,500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,200 మంది గాయపడ్డారు. ఈ దారుణాన్ని బ్రిటన్ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ తాజాగా ఆ దేశ పార్లమెంటులో గుర్తు చేశారు. వేలాది అమాయకుల మరణం, గాయపడిన ఈ ఘటనకు గాను భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

బ్రిటిష్ పాలకులు తెచ్చిన రౌలత్‌ చట్టంపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. దీనిని కఠినంగా అణచివేయాలని నిర్ణయించింది. 1919లో పంజాబ్‌లో ప్రసిద్ధ నాయకులు డాక్టర్‌ సత్యపాల్, సైఫుద్దీన్‌ కిచ్లూలను బంధించింది. దీంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అప్పటి ఉమ్మడి పంజాబ్ లోని అమృతసర్‌లో మార్షల్‌ లా విధించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జనరల్‌ డయ్యర్‌కు అప్పటింగింది. ఆ ఏడాది ఏప్రిల్‌ 13న వైశాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని అమృతసర్‌ లోని వాలాబాగ్‌ మైదానంలో నిరసన సభ, వైశాఖీ వేడుకలకు వేలాదిమంది సమావేశమయ్యారు. దీనికి అనుమతి లేదంటూ నిషేధాజ్ఞలు జారీ చేసిన డయ్యర్‌.. సాయుధ దళంతో మైదానాన్ని చుట్టుముట్టాడు. హెచ్చరికలు కూడా లేకుండా జనంపై తూటాల వర్షం కురిపించాడు. దీంతో మైదానం శవాలతో నిండిపోయింది.

కాగా, డయ్యర్ చర్యలను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సమర్థించలేదు. ఆయనను బ్రిటన్ పంపించేసింది. అయితే, 20 ఏళ్లు అతడిని వెంటాడిన సర్దార్ ఉద్ధమ్ సింగ్.. ఇంగ్లండ్ వెళ్లి మరీ చంపేశారు.

ఇక డయ్యర్ మారణ కాండకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2019లో యూకే ప్రధానిగా ఉన్న, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన థెరిసా మే ఈ ఘటనను ఓ మచ్చగా మాత్రమే అభివర్ణించారు కానీ క్షమాపణ చెప్పలేదు.

ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 13 రాబోతున్న సందర్భంగా విపక్ష కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బ్లాక్ మన్ మాత్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఇక్కడ రాజకీయ కోణం కూడా ఆలోచించాలి. యూకేలో మొన్నటివరకు సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్నది ఈయన పార్టీనే. అప్పుడు ఏమీ చెప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని క్షమాపణ కోరాలనడం రాజకీయ మొసలి కన్నీరే అవుతుంది.

Tags:    

Similar News