అన్న దాత సుఖీభవ లబ్దిదారులను తేల్చేసారా ?
అయితే 2024 జూన్ 12న అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తొలి ఏడాది మాత్రం రైతుల ఖాతాలో ఒక్క రూపాయి కూడా నిధులను జమ చేయలేదు.;

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో భారీ హామీలను ఇచ్చింది. అందులో భాగంగా రైతులను ఆదుకునేందుకు వైసీపీ తెచ్చిన రైతు భరోసాని మించి సాయం ఇస్తామని ప్రకటించింది. ఏకంగా ఇరవై వల రూపాయల ఆర్ధిక సాయం ఏడాదికి ప్రతీ రైతుకూ అందుతుందని కూడా పేర్కొంది.
అయితే 2024 జూన్ 12న అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తొలి ఏడాది మాత్రం రైతుల ఖాతాలో ఒక్క రూపాయి కూడా నిధులను జమ చేయలేదు. దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామని చెబుతూ వచ్చారు. అయితే అనేక చర్చల తరువాత కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ పధకం నిధులతో కలిపే తాము కూడా ఈ సాయం ఇస్తామని వెల్లడించారు.
అలా కనుక చూస్తే కేంద్రం ఏడాదికి ఆరు వేల రూపాయలు ఒక్కో రైతుకూ సాయం అందిస్తోంది. అది కూడా మూడు విడతలుగా ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు వంతున ఇస్తున్నారు. అలా తాము కూడా మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పధకాన్ని ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
అంటే మొత్తం 20 వేల రూపాయలలో ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి వచ్చే సాయం పోనూ కూటమి ప్రభుత్వం చెల్లించేది 14 వేల రూపాయలు అన్న మాట. ఇక లబ్దిదారులు ఎంత మంది ఉంటారు అన్న చర్చ కూడా ఉంది. మామూలుగా అయితే ఏపీలో రైతులు 60 లక్షలకు పైబడి ఉన్నారని లెక్క అయితే ఉంది. కానీ ఈ మొత్తం రైతులకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ఇవ్వడం లేదు. కేవలం 42 లక్షల మందికి మాత్రమే ఈ పధకం కింద నిధులు అందుతున్నాయి. అయితే అర్హులను మరో మూడు లక్షల మందిని గుర్తించి వారికి కూడా పధకం వర్తింప చేస్తామని కేంద్ర అధికారులు చెబుతున్నారు.
ఆ లెక్కన చూసుకుంటే 45 లక్షల మంది అన్న మాట. మరి రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉంటే మిగిలిన పదిహేను లక్షల మంది సంగతి ఏమిటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర లెక్కలనే తీసుకుని అన్నదాత పధకం అమలు చేయాలనుకుంటే ఆ 15 లక్షల మందికి అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు.
అయితే లబ్దిదారులను పీఎం కిసాన్ పధకంతో సరిపోల్చుకుని అన్న దాత పధకం ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. దాంతో వీరే ఇక మీదట అన్నదాత సుఖీభవ లబ్దిదారులు కూడా అవుతారు అని అంటున్నారు. వీరు కాకుండా ప్రత్యేకంగా గురించి ఇవ్వాలీ అంటే మొత్తం 20 వేల రూపాయలు ఒక్కో రైతు ఖాతాలో వేయాలి. అది ఇబ్బందికరం అవుతుంది.
అంతే కాకుండా ప్రత్యేకంగా వారికి ఇస్తే కేంద్ర నిధులతో సంబంధం లేకుండా మాకూ ఇరవై వేలు ఇవ్వాలని ఈ 45 లక్షల మంది కూడా కోరుతారు. దాంతో కేంద్రం పెట్టిన మార్గదర్శకాల మేరకు వారు ఎంపిక చేసిన రైతులను వారినే లబ్దిదారులుగా గుర్తించి పధకం అమలు చేయాలని కూటమి ఆలోచిస్తోంది అని వార్తలు వస్తున్నాయి.
మరి ఇదే కనుక జరిగితే మొత్తం ఏపీ రైతాంగంలో నాలుగవ వంతు పధకం అందక మిగిలిపోతారు అని అంటున్నారు. వారు ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉంటారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కేంద్ర పధకంతో సంబంధం లేకుండా మొదట ఇస్తామన్న 20 వేల రూపాయలను అందరికీ వర్తింపచేయాలన్న డిమాండ్ కూడా ఉంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ లో 6,300 కోట్ల రూపాయలనే కేటాయించింది. ఆ మేరకే లబ్దిదారులకు పధకం అందుతుందని అంటున్నారు. వైసీపీ నాయకులు మాత్రం ఏపీలో ఉన్న మొత్తం 60 లక్షల మంది రైతులకు పధకం వర్తింప చేయాలనీ అంటే 10 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని కూటమి ప్రభుత్వంలో లబ్దిదారులను తగ్గిస్తే ఊరుకోమని చెబుతున్నారు. చూడాలి మరి ఈ పధకం అమలు అయితే ఎలా ఉంటుందో.