90 ఏళ్ల హెచ్ సీఏ..వివాదాస్పద ‘అధ్యక్ష్య’..ఇప్పుడు విజిలెన్స్ ముందుకు
తాజాగా హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కూడా చిక్కుల్లో పడ్డారు.;

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) ఎంతో ఘన చరిత్ర కలిగిన సంఘం.. మొహమ్మద్ అజహరుద్దీన్ వంటి గొప్ప బ్యాట్స్ మన్ ను.. దాదాపు పదేళ్లు దేశానికి కెప్టెన్ ను అందించిన రికార్డు దీని సొంతం. అలాంటి హెచ్ సీఏ ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటుంది. ఓ విధంగా చెప్పాలంటే హెచ్ సీఏ అధ్యక్ష పదవి ఓ ముళ్ల కిరీటం.
నిజాం నవాబు హయాంలో 1934లో ఏర్పాటైంది హెచ్ సీఏ. ఇప్పటికి 91 ఏళ్లు. అయితే, గతంలో ఏమో కానీ.. కొన్నేళ్ల నుంచి ‘అధ్యక్ష’ పదవి లో ఎవరున్నా వివాదాలు తప్పడం లేదు.
ఇటీవలి కాలంలో చూసుకున్నా.. వివేక్ వెంకటస్వామి, మొహమ్మద్ అజహరుద్దీన్ లు హెచ్ సీఏ చైర్మన్లుగా ఉండగా వివాదాలు ఎదుర్కొన్నారు. దీనికి సంఘం అంతర్గత రాజకీయాలు కూడా ఒక కారణమే అనుకోవాలి. తాజాగా హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కూడా చిక్కుల్లో పడ్డారు.
ఐపీఎల్ మ్యాచ్ ఫ్రీ టికెట్ (పాస్ )ల వ్యవహారం ఇప్పుడు హెచ్ సీఏ-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య చినికిచినికి గాలివానగా మారింది. దీంతో హెచ్ సీఏ వ్యవహారాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు.
విచారణ నేపథ్యంలో హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు విజిలెన్స్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. కాగా, బీఆర్ఎస్ హయాంలో హెచ్ సీఏ అధ్యక్షుడు అయ్యారు జగన్ మోహన్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్ సీఏ వ్యవహారాలపై తరచూ ప్రస్తావన చేశారు. అసోసియేషన్ లో అవకతవకలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఇప్పుడు వీటి మధ్య సన్ రైజర్స్ వివాదం తెరపైకి వచ్చింది. ఇది ఎక్కడకు వెళ్తుందో చూడాలి.