భూమి మీదకొచ్చిన 12 రోజుల తర్వాత సునీతా అండ్ కో ఎలా ఉన్నారంటే?
సాధారణం.. అసాధారణం మధ్య ఉన్న తేడా ఒక అక్షరమే. అదే.. అక్షరం మొత్తం అర్థాన్ని మార్చేస్తుంది.;

సాధారణం.. అసాధారణం మధ్య ఉన్న తేడా ఒక అక్షరమే. అదే.. అక్షరం మొత్తం అర్థాన్ని మార్చేస్తుంది. సాదాసీదా మనుషులకు.. అసాధారణ వ్యక్తులకు మధ్యనున్న తేడాను కళ్లకు కట్టేలా చూపించింది అమెరికాలో నాసా ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశం. భయంకర అనుభవం తర్వాత కూడా సాహసానికి సిద్ధమని చెప్పటమే కాదు.. తనను తొమ్మిది నెలలు భూమి మీదకు రాకుండా చేసిన స్టార్ లైనర్ లో అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమేనా? అన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానం వింటే.. సాదాసీదా మనుషులకు.. వారికి ఉన్న తేడా ఇట్టే అర్థమవుతుంది.
కేవలం ఎనిమిది రోజుల అంతరిక్ష పర్యటనకు వెళ్లి.. ఏకంగా 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి.. ఎట్టకేలకు మళ్లీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తో పాటు నిక్ హేగ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వీరు భూమి మీదకు చేరుకున్న తర్వాత హ్యుస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించి.. అబ్జర్వేషన్ లో ఉంచారు. పన్నెండు రోజుల తర్వాత తొలిసారి బాహ్య ప్రపంచం ముందుకు వచ్చారు. ఈ మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఉత్సాహంగా బదులిచ్చారు. మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ లో భూమి మీదకు అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
సుదీర్ఘకాలంపాటు అంతరిక్షంలో ఉన్న కారణంగా పెద్ద ఎత్తున ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశంతో పాటు.. ఇక్కడి వాతావరణానికి శరీరం మామూలు స్థితికి చేరుకునేందుకు కొంతకాలం పడుతుంది. అయినప్పటికి పన్నెండు రోజుల వ్యవధిలోనే.. ప్రెస్ మీట్ లో పాల్గొనే వరకు రావటం నిజంగా గొప్పగా చెప్పాలి. ఈ సందర్భంగా సునీతా అండ్ కోకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వారు ఇచ్చిన సమాధానాల్ని చూస్తే..
సునీతకు భయంకరమైన అనుభవాన్ని (ప్రపంచ ప్రజల భావన అని మర్చిపోవద్దు) మిగిల్చిన స్టార్ లైనర్ లో మళ్లీ అంతరిక్ష కేంద్రానికి వెళతారా? అని ప్రశ్నించగా నవ్వుతూ బదులిచ్చిన సునీతా.. ‘అది చాలా సామర్థ్యం ఉన్న వాహననౌక. కచ్ఛితంగా అందులో ప్రయాణిస్తా. అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నది నిజం. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది’ అని బదులిచ్చారు. సునీతతో పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి తిరిగి వచ్చిన విల్మోర్ ఇదే ప్రశ్నకు బదులిస్తూ.. బోయింగ్.. నాసా కలిసి స్టార్ లైనర్ లో ఏర్పడ్డ సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పారు.
తమ మిషన్ సక్సెస్ అయ్యేందుకు సాయం చేసిన నాసా టీంకు థ్యాంక్స్ చెప్పిన వారు.. గతంలో తాము తీసుకున్న శిక్షణ ఐఎస్ఎస్ కు వెళ్లేలా రెఢీ చేసిందన్నారు. భూమి మీదకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు తాను మూడు మైళ్లు పరిగెత్తినట్లుగా సునీత తెలియజేశారు. తాను సాధారణ స్థితికి రావటానికి సాయం చేసిన ట్రైనర్లకు సునీత ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. అంతరిక్షంలో ఉన్నప్పుడు తమ టాస్కుల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేశామని.. శిక్షణ పొందినట్లుగా చెప్పారు.
తాను అంతరిక్షంలో ఉన్నప్పుడు తన ఆరోగ్యంపై ఎంతో మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసన్న సునీత.. ‘‘అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చాక శరీరంలో కొన్ని మార్పులు ఉంటాయి. అందుకు తగ్గట్లు కొన్ని సర్దుబాట్లు అవసరం. మేం భూమి మీదకు దిగిన తర్వాత నుంచి మా బలాన్ని తిరిగి పొందేందుకు సహాయక టీం సభ్యులు ఎంతో సాయం చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
ఇక.. నిర్లక్ష్యం కారణంగానే అంతరిక్ష కేంద్రంలో ఇరుక్కుపోయారన్న ప్రశ్నకు సునీతా.. విల్మోర్ లు ఇద్దరు ఒకేలా స్పందించటం గమనార్హం. ‘మేం ఎప్పుడులా అలా భావించలేదు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టే ఉద్దేశం మాకు లేదు. అనుకున్న ప్రకారం మేం భూమి మీదకు రాలేకపోయాం. ఒక రకంగా ఇరుక్కుపోయామనే భావించాల్సి ఉంటుంది. మరో రకంగా అక్కడ ఉండాల్సి వచ్చింది. అయితే.. మేం తీసుకున్న కఠిన శిక్షణ ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది’’ అని పేర్కొన్నారు. ఇదే ప్రెస్ మీట్ లో మరో కఠినమైన ప్రశ్నను ఎదుర్కొన్న సునీత టీంలోని మరో వ్యోమగామి నిక్ హేగ్ ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. మిషన్ చుట్టూ రాజకీయం నడిచిందన్న వాదనలో అర్థం లేదన్నారు.