ఇక తగ్గేదేలే... హైడ్రా దూకుడుకు మరిన్ని అస్త్రాలు..
హైడ్రా కోసమే ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రత్యేకంగా హైడ్రాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ హైడ్రాకు మరిన్ని అస్త్రాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హైడ్రా కోసమే ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ నగర పరిధిలోని అనేక చోట్ల ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా ఇప్పటికే కూల్చివేసింది. వీటిలో ప్రముఖులకు సంబంధించిన అనేక నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారాలపై అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తోపాటు ప్రముఖ రాజకీయ నాయకుల నివాసాలు, అపార్ట్మెంట్లు, గెస్ట్ హౌస్లను కూడా హైడ్రా తొలగించింది. ముందుగా నోటీసులు ఇచ్చి వారిని ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతుండగా, అందుకు ముందుకు రాకపోతే వాటిని బలవంతంగా తొలగిస్తున్నారు.
రానున్న రోజుల్లో హైదరాబాద్ మరిన్ని అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కార్యాలయాన్ని ఇప్పటికే సికింద్రాబాద్‌లోని బుద్ధ భవన్‌లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములు, సరస్సులు, డ్రైనేజీ లైన్లు, పార్కులు, మైదానాలను రక్షించడం హైడ్రా బాధ్యత కింద ప్రభుత్వం అప్పగించింది.
హైడ్రా అధికార పరిధి హైదరాబాద్, ఓఆర్ఆర్‌తోపాటు మధ్యలో మూడు కమిషనరేట్లను కలిగి ఉన్న ప్రాంతం అంతటా విస్తరించి ఉంది. ఈ క్రమంలోనే భూ వివాదాలకు సంబంధించి కేసులు నమోదు, విచారణను క్రమబద్ధీకరించేందుకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. హైడ్రా భూ కబ్జాదారులు, అక్రమార్కుల ఆస్తులను పాడు చేయడం, ఆస్తుల రక్షణకు సంబంధించి ఇతర అంశాలపై ఇక్కడ కేసులు నమోదు చేయనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులన్నీ సాధారణ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్నాయి. దీనివల్ల ఆలస్యం కావడంతో పాటు సకాలంలో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని హైడ్రా కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైడ్రా కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా కేసులో నమోదు చేసి విచారణ జరపనున్నారు. అనంతరం ఆయా కేసులకు సంబంధించి చర్యలను హైడ్రా తీసుకుంటుంది. ఈ పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఏర్పాటు చేస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన విధివిధానాలు వెలుపడతాయని చెబుతున్నారు.