ఏబీవీ అలక.. మద్దతుగా టీడీపీ క్యాడర్!

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై అలిగారా? తనకు ఇచ్చిన పదవి పట్ల ఆయనకు సంతృప్తి లేదా? అంటే నిజమే అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.

Update: 2025-02-12 13:30 GMT

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై అలిగారా? తనకు ఇచ్చిన పదవి పట్ల ఆయనకు సంతృప్తి లేదా? అంటే నిజమే అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. గత ప్రభుత్వంలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న ఏబీవీకి సరైన న్యాయం జరగలేదంటూ టీడీపీ కార్యకర్తలే అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఏబీవీ కూడా ఇంతవరకు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ బాధ్యతలు తీసుకోలేదంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీకి నేరుగా ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, ఆయనను తమ వాడిగానే పరిగణిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా పనిచేసిన పోలీసు అధికారిగా టీడీపీ క్యాడర్ అభిమానం పొందారు ఏబీవీ. అదేసమయంలో వైసీపీకి బద్ధ శత్రువుగా మారారంటున్నారు. ఆ కారణంగానే 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించిందని టీడీపీ కార్యకర్తలు, నేతలు చెబుతున్నారు. ఐదేళ్ల వ్యవధిలో రెండు సార్లు సస్పెండ్ చేయడమే కాకుండా, రిటైర్మెంటుకు ఒక్కరోజు ముందు పోస్టింగ్ ఇవ్వడం, కోర్టులు చెప్పినా ఆయనను గత ప్రభుత్వం వేధించిందనే అభిప్రాయంతో టీడీపీ కార్యకర్తలు ఏబీవీపై సానుభూతి పెంచుకున్నారంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏబీవీకి న్యాయం చేయాలంటూ ఆ పార్టీ సోషల్ మీడియానే పెద్ద ఎత్తున పోరాటం చేసింది.

ఇక కార్యకర్తల ఒత్తిడితో చంద్రబాబు ప్రభుత్వం ఏబీవీకి అనేక రకాలుగా మేలు చేసిందని అంటున్నారు. ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరించడంతోపాటు ఆ సమయంలో చెల్లించాల్సిన బకాయిలన్నీ క్లియర్ చేయాలని ఆదేశించింది. మరోవైపు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మనుగా రెండేళ్ల పదవీ కాలానికి నియమించింది. అయితే చంద్రబాబు కోసం ఎంతో కష్టపడిన ఏబీవీకి ఆ పదవి సరిపోదని టీడీపీ కార్యకర్తలే భావిస్తున్నారు. ఏబీవీ కూడా ఆ పదవిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని అంటున్నారు. ఆ కారణంగానే ఆయన ఇంతవరకు బాధ్యతలు స్వీకరించకుండా అలక పాన్పు ఎక్కారని ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నంతవరకు క్రమశిక్షణతో మెలిగిన ఏబీవీ.. రిటైర్ అయి చంద్రబాబు సీఎం అయ్యాక తనకు జరిగిన అన్యాయంపై గళం విప్పారు. అంతేకాకుండా తను కమ్మకులంలో పుట్టడం వల్ల, చంద్రబాబు సామాజికవర్గం అవ్వడం వల్లే వేధింపులకు గురయ్యానంటూ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ పెద్దలపై తీవ్ర విమర్శలు చేసి టీడీపీ సోషల్ మీడియాలో హీరోగా ముద్రపడ్డారు. అయితే ఆయనకు పదవి విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం ఆసక్తిరేపుతోంది. ఏబీవీకి కేబినెట్ హోదాతో కూడిన పదవి ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఏబీవీకి ఆర్టీసీ ఎండీగా నియమిస్తారని తొలుత ప్రచారం జరిగింది.

అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీ ఎండీకి మంచి గుర్తింపు ఉంటుంది. దీంతో ఏబీవీ కూడా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం రిటైర్డ్ డీజీపీ ద్వారకా తిరుమలరావుకి ఆ పదవిలో నియమించింది. దీంతో ఏబీవీ నిరాశ చెందారంటున్నారు. దీంతో ఆయనకు ప్రస్తుతం ఇచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికే కేబినెట్ హోదా ఇచ్చి కొనసాగించాలని పార్టీలో కొందరు ప్రతిపాదిస్తున్నారు. అయితే తనకు సరైన గుర్తింపు కోరుకుంటున్న ఏబీపీ ఆ పదవితో సంతృప్తి చెందకపోవడానికి కారణమేంటి? అన్నది టీడీపీలో చర్చకు దారితీస్తోంది. ఏబీవీ మనసులో ఏముందో తెలుసుకోడానికి కొందరు కమ్మ సామాజికవర్గం నేతలు రంగంలోకి దిగారంటున్నారు. మొత్తానికి ఏబీవీ అలక కూటమి ప్రభుత్వంలో తీవ్ర చర్చగా మారింది. ఆయనను ఎలా సంతృప్తి పరుస్తారో చూడాల్సివుంది.

Tags:    

Similar News