'ఫార్ములా' పై ఏసీబీ కౌంటర్ లో ఏముంది?

మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ లో ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ కౌంటర్ దాఖలు చేశారు. అందులో పేర్కొన్న ముఖ్య అంశాల్ని చూస్తే..

Update: 2024-12-28 04:30 GMT

కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి నిధుల దర్వినియోగం భారీగా సాగిందన్న ప్రచారంతో పాటు.. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ హస్తం ఉందని.. భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా ఆరోపిస్తున్న ఏసీబీ.. తాజాగా హైకోర్టుకు కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ వినిపిస్తున్న వాదనకు భిన్నమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చింది.

చట్టప్రకారమైనా వాస్తవాల్ని పరిశీలించకుండా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదు. దాన్ని కొట్టేయాలి. మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ లో ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ కౌంటర్ దాఖలు చేశారు. అందులో పేర్కొన్న ముఖ్య అంశాల్ని చూస్తే..

- ఫార్ములా ఈ రేసు ఒప్పందాల్లో మంత్రిగా ప్రభుత్వసొమ్మును దుర్వినియోగం చేయటం ద్వారా కేటీఆర్ నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు. మంత్రిమండలి.. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలని మంత్రిగా కేటీఆర్ ఆదేశించటంనిబంధనలకు విరుద్ధం.

- అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు రూ.54 కోట్లకు పైగా సొమ్ము బదిలీ జరిగింది. ఇలా చేయటం ద్వారా హెచ్ఎండీపై రూ.8 కోట్లకుపైగా అదనపు భారం పడింది. అసంబద్ధమైన కారణాలతో కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించటం దర్యాప్తును అడ్డుకోవటానికే.

- 2022 అక్టోబరు 25న ఫార్ములా - ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ పురపాలక శాఖ.. ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు మధ్య 9-12 సీజన్ రేసులను హైదరాబాద్ లో నిర్వహించటానికి ఒప్పందం కుదరింది. పదో సీజన్ లో ప్రమోటర్ వైదొలగటంతో రేసు నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే స్వీకరించింది.

- హెచ్ఎండీఏ ప్రమోటర్ గా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 2023లో బకాయిల కింద హెచ్ఎండీఏ జనరల్ ఫండ్స్ నుంచి రూ.54 కోట్లకు పైగా విదేశీ సంస్థకు చెల్లించారు. సాధారణంగా రూ.10 కోట్లకు మించి చెల్లింపులు జరిగితే మంత్రివర్గ్గం ఆమోదంతో పాటు ఆర్థిక శాఖ అంగీకారం తీసుకోవాల్సి ఉంది.

- ఇవేమీ చేయకుండానే నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు చెల్లింపులు జరిగాయి. వాస్తవానికి ఒప్పందం ప్రకారం అలాంటి చెల్లింపులు జరిగాయి. వాస్తవానికి ఒప్పందం ప్రకారం అలా చెల్లింపులు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. మొదటి ఒప్పందం రద్దు కాగానే రరెండోసారి 2023 అక్టోబరు 30న ఎఫ్ఈవో - పురపాలక శాఖ మధ్య ఒప్పందం కుదరింది.

- ఈ ఒప్పందం ప్రకారం స్పాన్సర్ మొత్తంతో పాటు ప్రభుత్వమే మౌలిక వసతులను కల్పించాల్సి ఉంది. మూడేళ్లకు ఫార్ములా ఈ రేసు నిమిత్తం రూ.600 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం.

- 2022 నాటి ఒప్పందం కొనసాగించటానికి ఈసీ అనుమతి అవసరం లేదన్న కేటీఆర్ వాదన అర్థరహితం. మొదటి ఒప్పందం 2022 అకటోబరు 15న జరగ్గా.. 2023 అక్టోబరు 27నరద్దు అయ్యింది. తర్వాత 2023 అక్టోబరు 30న ఒప్పందం కుదరగా.. అంతకు ముందే అక్టోబరు 3, 11 తేదీల్లో హెచ్ఎండీఏ నుంచి రూ.54 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి.

- 2022 ఒప్పందం ప్రకారం ఫార్ములా ఈ రేసులో ట్రాక్ నిర్మాణం.. మౌలికసదుపాయాలు కల్పించటమే ప్రభుత్వ పాత్ర. అంతేకానీ స్పాన్సర్ తరఫున చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. పిటిషన్ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు.

- రికార్డుల ప్రకారం కేటీఆర్ నేరానికి పాల్పడినట్లుగా ప్రాథమికండా రుజువు అవుతుంది. రాజకీయ కక్షతో.. ఒత్తిళ్లతో పిర్యాదు చేశారన్న వాదన సరికాదు. ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయటం సుప్రీం తీర్పునకు విరుద్ధమని కేటీఆర్ వాదిస్తున్నారు. తీవ్రమైన అభియోగాలు ఎఫ్ఐఆర్ లో ఉంటే ప్రాథమిక విచారణ లేకుండా కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

Tags:    

Similar News