ఎయిరిండియా ఫ్లైట్ ఎక్కితే వర్కు ఫ్రం హోం!

విమానంలో జర్నీ చేసే వేళలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా ఇంటర్నెట్ సేవల్ని అందించే సౌకర్యాన్ని ప్రవేశ పెట్టనున్నట్లుగా ఎయిరిండియా వెల్లడించింది.

Update: 2025-01-02 11:30 GMT

వర్కు ఫ్రం హోం గురించి తెలిసిందే. మరి.. ఈ వర్కు ఫ్రం ఎయిర్ ఏమిటి? అన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. తరచూ విమాన ప్రయాణం చేసే వారికి ఎయిరిండియా అదిరే న్యూస్ చెప్పింది. విమానంలో జర్నీ చేసే వేళలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా ఇంటర్నెట్ సేవల్ని అందించే సౌకర్యాన్ని ప్రవేశ పెట్టనున్నట్లుగా ఎయిరిండియా వెల్లడించింది. దీంతో.. తరచూ విమాన ప్రయాణాలు చేసే వారికి అనువుగా ఉండటమే కాదు.. తమ డిజిటల్ పనుల్ని పూర్తి చేసేందుకు సాయం చేస్తుంది.

దేశీయ.. అంతర్జాతీయ రూట్లలో ఎయిరిండియా తమ వైఫై సేవల్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. ఈ తరహా సేవల్ని అందిస్తున్న మొదటి భారతీయ విమానయాన సంస్థగా మారనుంది. వైఫై సేవలతో ప్రయాణికులు విమానంలోనేతమ వర్కు ఫ్రం ఎయిర్ ట్రెండ్ షురూ చేసే వీలుంటుంది. భూమికి పదివేల అడుగుల ఎత్తులో కూడా ఇంటర్నెట్ కనెక్ట్ కావటం ఈ సదుపాయంలో మరో ప్రత్యేకతగా చెబుతున్నారు.

వైఫై సేవల్ని ప్రవేశ పెట్టడం ద్వారా ఎయిరిండియా విస్తరణలో మరో ముఖ్యమైన అడుగుగా అభివర్ణిస్తున్నారు. దీంతో విమానయాన రంగంలో పోటీని పెంచటమే కాదు.. ప్రయాణికుల అనుభవాన్ని సైతం మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. త్వరలో ఈ సేవలు మరింత ఎక్కువగా అందుబాటులోకి వచ్చేలా చేయటం వల్ల విమానయాన రంగంలో భారత విమానయాన సంస్థలు మరో అడుగు వేసినట్లు అవుతుంది.

ఎయిరిండియా తన వైఫై సేవల్ని ప్రకటించిన నేపథ్యంలో.. దేశీయంగా విమాన సేవల్లో కీలక పాత్ర పోషిస్తూ.. ట్రాఫిక్ లో సింహభాగాన్ని సొంతం చేసుకున్న ఇండిగో నిర్ణయం ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఈ సేవల్ని ఎలా అందిస్తారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. శాటిలైట్ కనెక్టివిటీ ఆధారంగా పని చేస్తాయని చెబుతున్నారు. తొలుత ఈ సేవల్ని న్యూయార్క్.. లండన్.. పారిస్.. సింగపూర్ లాంటి అంతర్జాతీయ స్వరీసుల్లో షురూ చేయనున్నారు. ఎయిర్ బస్ ఏ350, ఏ321 నియో.. బోయింగ్ 787-9 విమానాల్లో ప్రవేశ పెడతారు. తర్వాతి దశల్లో దేశీయ సర్వీసుల్లోకి అందుబాటులోకి తేనున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News