ఐపీఎల్ జట్టుకు గొప్ప మేలు.. నీదెంత గొప్ప మనసు అక్షయ్?
'పిచ్ సైడ్ : మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్'లో దీన్ని వివరించారు. ఆ పుస్తకం అక్షయ్ గొప్పదనం చెబబుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే డబ్బుమయం. ఆటగాళ్ల బూట్ల దగ్గరి నుంచి బ్యాట్ల వరకు ప్రతి దానిపైనా అడ్వర్టయిజింగే హోరెత్తుతుంది. కేవలం ప్రకటనల ద్వారానే ఐపీఎల్ లో రూ.వేల కోట్ల డబ్బు చలామణి అవుతుందంటే అతిశయోక్తి కాదేమో? ఇక లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, అత్యంత ప్రజాదరణ ఉండే బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఎండార్స్ మెంట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే, లీగ్ తొలినాళ్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ (డీడీ) కూడా బలమైన జట్టే. నాలుగేళ్ల కిందట దీని పేరును ఢిల్లీ కేపిటల్స్ గా మార్చారు. కానీ, ఇప్పటివరకు ఆ జట్టు టైటిల్ కొట్టిందే లేదు. రానురాను బలహీనపడడం తప్ప పుంజుకున్నదీ లేదు. అసలు లీగ్ ప్రారంభమైంది 2008లో కాగా.. 2009లోనే డీడీకి కష్టాలు వచ్చాయట. దీంతో పొదుపు చర్యల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలగాలని డీడీ కోరుకుందట. కానీ, అక్షయ్ తో ఉన్నది మూడేళ్ల కాంట్రాక్ట్. న్యాయపరమైన చిక్కులు ఉన్న నేపథ్యంలో.. దాన్నుంచి వైదొలగడం అంత సులువు కాదు.
పైసా కూడా వదులుకోని వారుండగా..
ఈ రోజుల్లో ప్రొఫెషనల్ కాంట్రాక్టు అంటే కాంట్రాక్టే. రెమ్యునరేషన్ లో పైసా తగ్గినా అవతలి వారు ఒప్పుకొనే పరిస్థితి లేదు. ఓవిధంగా చూస్తే ఇది సరైనది కూడా. కానీ, డీడీ 2009లో చాలా ఇబ్బందులో కూరుకుంది. అక్షయ్ తో కుదుర్చుకున్న ఒప్పందం చూస్తేనేమో గుదిబంగా కనిపించింది. ప్రమోషనల్ ఫిల్స్మ్, ఈవెంట్లలో పాల్గొనడం, కార్పొరేట్ ఈవెంట్లకు హాజరు వంటివి కాంట్రాక్టులో భాగం. కాంట్రాక్టు కింద డీడీ భారీ మొత్తం వెచ్చించాల్సిన అవసరం ఉంది. అసలు కష్టాల్లో ఉంటే ఆ డబ్బు ఇవ్వడం ఎలా అనేది సమస్యగా మారింది. అక్షయ్ ను అడగలేదు.. తాను ఇవ్వకుంటే లీగల్ గా చిక్కులు తప్పవు. అందుకనే తలపట్టుకుంది. మరప్పుడు ఏం జరిగిందో చెబుతూ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. క్రికెట్ మాజీ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మాథుర్ జీవిత చరితర 'పిచ్ సైడ్ : మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్'లో దీన్ని వివరించారు. ఆ పుస్తకం అక్షయ్ గొప్పదనం చెబబుతోంది.
ఒక్కటే మాట.. మనం ముగిద్దాం..
ఆర్థికంగా దారుణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో డీడీకి అక్షయ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బు ఇవ్వడం కష్టంగా మారింది. దీంతో డీడీ తరఫున కొందరు అక్షయ్ లాయర్లతో మాట్లాడారు. కానీ వారు ఒప్పుకోలేదు. నేరుగా అక్షయ్ తోనే మాట్లాడి దయ చూపాలని కోరేందుకు డీడీ యాజమాన్యం సిద్దమైంది. దీనికి మాథుర్ సహా మరికొందరు ఆయన వద్దకు వెళ్లారు. ఢిల్లీలో 'చాందినీ చౌక్ టు చైనా' సినిమా షూటింగ్‌లో ఉన్న అక్షయ్ ను క్యారవ్యాన్ లోకి వెళ్లి కలిశామని.. పరిస్థితిపై వివరణ ఇచ్చామని మాథుర్ తెలిపారు. దినకి ఆయన ఏమంటారో అని భయపడుతుండగా.. 'సమస్యేమీ లేదు. వీలు కానప్పుడు వదిలేద్దాం' అంటూ ఒక్క మాటలో తేల్చారని మాథుర్ వివరించారు. తాను అయోమయంలో ఉండగా.. మళ్లీ అక్షయ్ కుమార్ కల్పించుకుని 'మనం ఇంతటితో ముగిద్దాం' అని స్పష్టం చేశారని వివరించారు. లీగల్ ఇబ్బందులు లేకుండా లాయర్లతో మాట్లాడానని కూడా అభయమిచ్చినట్లు కూడా వివరించారు.
ఎంత పెద్దమొత్తమో..?
డీడీ నుంచి అక్షయ్ వదులుకున్నది ఎంత పెద్దమొత్తం అన్నది ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ మాథుర్ మాటలను బట్టి
అది చాలా పెద్ద మొత్తమేని తెలుస్తోంది. అందుకే చాలా ఏళ్ల పాటు తాను అక్షయ్ ఇంత పెద్ద మొత్తం తృణప్రాయంగా ఎలా వదులుకున్నాడనే ఆశ్చర్యంలో ఉన్నట్లు వివరించారు. రూ.కోట్ల కాంట్రాక్టును క్షణాల్లోనే రద్దు చేస్తున్నట్లు చెప్పడం మామూలు విషయం కాదంటూ మాథుర్ తన పుస్తకంలో వెల్లడించారు. మొత్తానికి అలా.. అక్షయ్ కుమార్ గొప్ప మనసు బయటపడింది.