బాబు జైలుపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి

చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు ఆయన చేసిన తప్పులే కారణమన్న అంబటి.. 'సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ను తట్టుకోలేక ఆయనకు అండగా నిలిచిన నాపై దాడులు చేస్తున్నారు.

Update: 2023-10-30 04:37 GMT

ఆవేశం ఉండాలి. కానీ.. అర్థవంతంగా ఉండాలి. రాజకీయాల్లో వైరం సహజం. అంతమాత్రాన దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. రాజకీయ క్రీడలో గెలుపుఓటములు ఒక్కరివే శాశ్వితం కాదు. అంతేకాదు.. ఈ ఆటలో కీలకభూమిక పోషించేది నేతలు..అధినేతలు.. పార్టీలు అనే కన్నా ప్రజలే డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నది మర్చిపోకూడదు. ఇలాంటి వేళ.. వారి మీద ప్రభావాన్ని చూపేలా.. సొంత పార్టీకి నష్టం కలిగించే మాటలు మాట్లాడకూడదు. ఈ విషయాన్ని అప్పుడప్పుడు మర్చిపోతూ.. కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టటంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు ముందుంటారు.

తాజాగా ఆయన నోటి నుంచి ఆ తరహా వ్యాఖ్యలు వచ్చాయి. ఏపీ విపక్ష నేత చంద్రబాబు స్కిల్ స్కాం ఆరోపణలతో జైలుపాలు కావటం..రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండటం తెలిసిందే. గడిచిన యాభై రెండురోజులుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే.. జైల్లో ఉంటున్నారు. ఆయన బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానాల నుంచి నిర్ణయాలు వెలువడాల్సి ఉంది. ఇలాంటి వేళ.. చంద్రబాబు జైలు జీవితానికి యాభై రోజులు కావటంపై ఆ పార్టీ వర్గీయులు.. కార్యకర్తలు.. సానుభూతిపరులు ఆందోళనలు.. వివిధ కార్యక్రమాల్నిచేస్తున్నారు.

ఇలాంటివేళ.. మంత్రి అంబటి రాంబాబు నోటి నుంచి షాకింగ్ వ్యాఖ్యలు వచ్చాయి. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో 'వై ఏపీ నీడ్స్ జగన్' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మంత్రి అంబటి హాజరయ్యారు. చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు ఆయన చేసిన తప్పులే కారణమన్న అంబటి.. 'సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ను తట్టుకోలేక ఆయనకు అండగా నిలిచిన నాపై దాడులు చేస్తున్నారు. ఒక సామాజిక వర్గం వారే నాపైదాడి చేస్తున్నారు. వైసీపీ కోసంఎంత దూరమైనా వెళ్తా. యాభై రోజులే కాదు శతదినోత్సవాలు జరుపుకుంటారు''అంటూచంద్రబాబు జైలుపై చేసినవ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.

ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై మంత్రిగా ఉన్న రాంబాబు.. ఇలా ఎలా మాట్లాడతారన్న విమర్శ వినిపిస్తోంది. కొన్ని అంశాల్ని ప్రస్తావించకపోతే మంచిదన్న విషయాన్ని అంబటి మర్చిపోతున్నారు.

తప్పు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు జైల్లో ఉన్న వేళ.. తదుపరి నిర్ణయాల్ని తీసుకునే విషయంలో కోర్టుల్లో కేసులు నడుస్తున్న సమయంలో ఈ తరహా వ్యాఖ్యలు సరికావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటివి పార్టీకి.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారతాయంటున్నారు. మరి.. ఈ విషయంపై అంబటి ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News