జనసేన ‘స్టార్ క్యాంపెయినర్’ ఎక్కడ?
భారత మాజీ క్రికెటర్, స్టార్ బ్యాట్సమెన్ అంబటి రాయుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరిన సంగతి తెలిసిందే.
భారత మాజీ క్రికెటర్, స్టార్ బ్యాట్సమెన్ అంబటి రాయుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరిన సంగతి తెలిసిందే. గుంటూరు పార్లమెంటు నుంచి లేదా పొన్నూరు అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టే వైసీపీకి అనుకూలంగా అడపదడపా సోషల్ మీడియాలో అంబటి రాయుడు పోస్టులు పెడుతూ వచ్చారు.
అంతేకాకుండా ప్రత్యక్షంగానూ గుంటూరు పార్లమెంటు నియోకవర్గం పరిధిలో తెనాలి మండలం కొలకలూరు, ఫిరంగపురం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో అంబటి రాయుడు చురుగ్గా పర్యటించారు. పలు పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. అలాగే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. వాటిపై ప్రశంసలు కురిపించారు.
ఇక అంబటి రాయుడును గుంటూరు పార్లమెంటు నుంచి వైసీపీ తరఫున అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి అనుకున్నారు. అయితే ఎక్కడ తేడా కొట్టిందో గానీ అంబటి రాయుడు నేరుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆయన ఆలోచనలు, తన ఆలోచనలు ఒకటేనని.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పవన్ పై ప్రశంసలు కురిపించారు.
అంతేకాకుండా అంబటి రాయుడు జనసేన పార్టీలోనూ చేరారు. దీంతో జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని వార్తలు వెలువడ్డాయి. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మరోవైపు జనసేన పార్టీ తమ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అంబటి రాయుడికి కూడా జనసేన పార్టీ చోటు ఇచ్చింది.
అంబటి రాయుడితోపాటు జబర్దస్త్ ప్రోగ్రామ్ నటులు.. హైపర్ ఆది, గెటప్ శ్రీను, ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ తదితరులు తమ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్లగా జనసేన పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైపర్ ఆది, గెటప్ శ్రీను, జానీ మాస్టర్, హాస్య నటుడు పృథ్వీరాజ్ తదితరులు జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయితే అంబటి రాయుడు మాత్రం ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు.
ఇంకా ఎన్నికలకు 17 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎన్నికలకు 36 గంటల ముందు ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ వేస్తుంది. అంటే ఇంకా ప్రచారానికి 15 రోజుల సమయం మాత్రమే ఉన్నట్టు. అయితే అంబటి రాయుడు మాత్రం ఇప్పటివరకు ప్రచారానికి రాకపోవడంపై చర్చ జరుగుతోంది.
అంబటి రాయుడులో ఇదే ప్రధాన సమస్య అని అంటున్నారు. ఆయన ఏ విషయంలోనూ నిలకడగా ఉండరని.. అస్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనే విమర్శలు ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ కు తనను ఎంపిక చేయలేదని అలిగి క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం.. ఆ తర్వాత మళ్లీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం, అలాగే అన్ని రకాల క్రికెట్ నుంచి విరమించుకుంటున్నానని ప్రకటించడం.. మళ్లీ ఆ నిర్ణయాన్ని కొద్ది రోజుల వ్యవధిలోనే వెనక్కి తీసుకోవడం ఇందుకు ఉదాహరణలని అంటున్నారు.
అయితే ప్రజాసేవ చేయాలని తనకు కోరిక మెండుగా ఉందని పలుమార్లు చెప్పుకున్న అంబటి రాయుడు రాజకీయాల్లో చురుగ్గా లేకపోతే ఆయనకే ఇబ్బందని అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో అంబటి రాయుడు ప్రచారం చేస్తే అటు ఆయనకు, ఇటు జనసేనకు కొంతమేర ప్రయోజనం ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగిస్తే మళ్లీ ఐదేళ్ల వరకు అంబటి రాయుడు చేయడానికి కూడా ఏమీ ఉండదని అంటున్నారు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.