ఆ రెండు స్థానాలు గెలవాలి.. కుదిరితే మూడోది కూడా..

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా మండలిలో బలం లేని అధికార కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Update: 2025-02-19 12:30 GMT

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా మండలిలో బలం లేని అధికార కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాలను గెలుచుకుని సభలో తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిపించాలని, కుదిరితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీని కైవసం చేసుకోవాలని పార్టీ నేతలకు టార్గెట్ విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ రంగంలోకి దిగి ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తుండటంతో మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పోరు ఇంట్రస్టింగ్ గా మారింది.

ఏపీ శాసనమండలిలో ఇప్పటికీ విపక్షానికే ఎక్కువ బలం ఉంది. ప్రస్తుతం సభలో వైసీపీకి 37 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అదే సమయంలో టీడీపీ కూటమికి పది మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతానికి ఆరు ఖాళీలు ఉండగా, అధికార బలంతో ఆ ఆరూ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న మూడు చోట్లా కూడా గెలిచి వైసీపీ బలాన్ని తగ్గించాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో ఉభయగోదావరి, క్రిష్ణా-గుంటూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం పీడీఎఫ్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లో వారితోనే టీడీపీ కూటమి తలపడుతోంది.

గోదావరి జిల్లాల పట్టభద్ర స్థానానికి కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, క్రిష్ణా-గుంటూరు జిల్లాల స్థానానికి మాజీ మంత్రి ఆలపాటి రాజా పోటీ చేస్తున్నారు. వీరిద్దరి గెలుపు కోసం టీడీపీతోపాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా కృషి చేస్తున్నారు. ఈ రెండు స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఆరు నెలలుగా టీడీపీ పకడ్బందీగా పనిచేస్తోంది. గ్రామగ్రామాన ఓటర్ల చేర్పును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో గత ఎన్నికల కంటే రెట్టింపు సంఖ్యలో పట్టభద్ర ఓటర్లు నమోదయ్యారు. కొత్తగా చేరిన ఈ ఓటర్ల బలంతో గెలుపుపై కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నా.. ఏదో అనుమానం ఆ పార్టీని వెన్నాడుతోందని అంటున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ పోటీ చేయకపోయినా సిటింగ్ ఎమ్మెల్సీ రఘు వర్మకు మద్దతు ప్రకటించడంతో ఆ ఎన్నిక ఇంట్రస్టింగుగా మారింది.

తాజా ఎన్నికల్లో విపక్షం వైసీపీ పోటీ చేయకపోయినా, ప్రభుత్వం మాత్రం ఎన్నికను చాలెంజింగ్ గా తీసుకుందని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవడం వల్ల ఒనగూరే ప్రయోజనం కన్నా, పొరపాటున ఫలితం తారుమారైతేనే కూటమికి పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు. రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు జరుగుతున్న ఎన్నిక ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రజల నాడి ఎలా ఉందో తెలుస్తుందని అంటున్నారు. 9 నెలల పాలనకు ఈ ఎన్నికల ఫలితాలు ఓ రిఫరెండంగా భావించాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

వైసీపీ అధికారంలో ఉండగా, సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆ ఎన్నికల ఫలితాలు డేంజర్ బెల్ మోగించినా అప్పటి ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో తగిన మూల్యం చెల్లించారని అంటున్నారు. దీనిని గమనించే ప్రస్తుత సర్కారులో ముఖ్య నేతలు అంత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టారని చెబుతున్నారు.

Tags:    

Similar News