నామినేటెడ్‌.. నానా క‌ష్టం.. !

అయితే, గడిచిన ఐదేళ్లలో ఇలా పార్టీ కోసం పనిచేసిన వారి సంఖ్య వేలల్లో ఉండడంతో ఉన్న పదవులు అందరికీ సర్దుబాటు చేయలేక సీఎం చంద్రబాబుకు తీవ్ర తలనొప్పిగా మారింది.

Update: 2024-10-02 15:57 GMT

నామినేటెడ్ పదవుల పందేరం టిడిపి సర్కార్ కు తీవ్ర తలనొప్పిగా మారింది. ఈ పదవులను నాకంటే నాకే ఇవ్వాలంటూ అనేకమంది నాయకులు పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వాస్తవానికి పార్టీలో త్యాగాలు చేసిన వారు, పార్టీ కోసం ఐదు సంవత్సరాలు పాటు పోరాడిన వారికి ఈ పదవులు ఇవ్వాలని ముందుగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే, గడిచిన ఐదేళ్లలో ఇలా పార్టీ కోసం పనిచేసిన వారి సంఖ్య వేలల్లో ఉండడంతో ఉన్న పదవులు అందరికీ సర్దుబాటు చేయలేక సీఎం చంద్రబాబుకు తీవ్ర తలనొప్పిగా మారింది.

ఇప్పటికే 20 కార్పొరేషన్ పదవులు భర్తీ చేశారు. అయితే తాము కోరుకున్న చైర్మ‌న్‌ పదవులు రాలేదంటూ చాలామంది డైరెక్టర్ పదవులను తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికే నలుగురు అంతర్గ తంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మీ పదవులు మాకు అవసరం లేదంటూ వెళ్ళిపోయారు. ఈ సంగతి ఇలా ఉంటే మరోవైపు భర్తీ చేయాల్సినటువంటి పదవుల విషయంలో తీవ్ర డైల‌మా ఏర్పడింది. ప్రస్తుతం అందుబాటులో 2000 ప‌దవులు ఉన్నాయి.

కానీ, ఇప్పటి వరకు పార్టీకి అందిన‌ దరఖాస్తులు, వినతులు అదేవిధంగా సర్వేల రూపంలో తెచ్చుకున్న సమాచారం ప్రకారం 30 వేల మందికిపైగా నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరినీ నామినేట్ చేయటం పార్టీకి కష్టతరంగా మారింది. మరోవైపు కూటమి పార్టీలు జనసేన, బిజెపి కూడా పదవుల విషయంలో పోటీ పడుతున్నాయి. ఈ రెండు పార్టీలకు సంబంధించి సుమారు 130 మంది పేర్లు అధిష్టానానికి అందించారు.

జనసేనకు 30% బిజెపికి 10 శాతం చొప్పున పదవులు ఇవ్వాలని ముందుగా ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఆయా పదవులను తీసుకునేందుకుగాను బిజెపి, జనసేన అభ్యర్థుల పేర్లను చంద్రబాబుకు పంపించారు. కానీ టిడిపి నుంచి పెరుగుతున్న పోటీ ఎవరినీ తీసేసే పరిస్థితి లేకపోవడం, అందరూ పార్టీ కోసం కష్టపడిన పరిస్థితిలో ఎవరినీ కాదన లేని సిచువేషన్ ఏర్పడింది. దీంతో నామినేటెడ్ పెదవులు పంపకం చంద్రబాబుకు తీవ్ర తలనొప్పిగా మారింది. అప్పటికీ అనేక వడపోత‌ల ద్వారా సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు.

ప్రస్తుతం 30 వేల మందిని ఎంపిక చేశారు. ఈ 30 వేల మందిలో ఎన్ని రకాలుగా వ‌డ‌పోత‌ చేసినా కనీసం పాతికవేల మందికి పైగానే కీలక నాయకులు కనిపిస్తున్నారు. ఇప్పుడు వీరందరికీ నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలి? వీరిని ఎలా సంతృప్తి పరచాలన్న విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ అంతర్గత సమావేశాల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కష్టపడ్డారని, కానీ పదవులు అంతమందికి ఇచ్చే పరిస్థితి లేదని ఆయన కరాకండిగా చెప్తున్నారు.

ఈ నేప‌థ్యంలో త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు వీరిని బుజ్జగించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్లుగా మేయర్లుగా జడ్పిటిసిలు ఎంపీటీసీలుగా గెలిపించుకునేందుకు అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పదవులను ఆశిస్తున్న వారు అప్పటివరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News