ధరల సవరణ ఎఫెక్ట్ : రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కిటకిట
ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ఒక్కాసారిగా రద్దీ పెరిగింది. ఫిబ్రవరి 1 నుంచి ధరలు సవరించనుండటంతో అంతా ఒక్కసారి అలర్ట్ అయ్యారు.
ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ఒక్కాసారిగా రద్దీ పెరిగింది. ఫిబ్రవరి 1 నుంచి ధరలు సవరించనుండటంతో అంతా ఒక్కసారి అలర్ట్ అయ్యారు. ఇదే సమయంలో అమావాస్య వెళ్లిపోవడం, మాగ మాసం కావడంతో గురు, శుక్రవారాల్లో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. కస్టమర్లు భారీగా తరలిరావడంతో ఆఫీసుల్లో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. దీంతో సర్వర్లు డౌన్ అయిపోతున్నాయి.
శనివారం నుంచి ఏపీలో సవరించిన రిజిస్ట్రేషన్ చార్జీలు అమలులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు సవరిస్తూ ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలు సవరించాలని సర్కులర్లో పేర్కొంది. ఫిబ్రవరి 1న నుంచి సవరించిన విలువలు అమలు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు. ప్రభుత్వ సర్కులర్ ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువల పెంపు, తగ్గింపు చేసే అవకాశం ఉంది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఒకేసారి రద్దీ పెరిగింది. గుంటూరులో అయితే గురువారం అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. అదేవిధంగా విజయనగరం, భోగాపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి చోట్ల రిజిస్ట్రార్ ఆఫీసులు ముందు జనం క్యూకడుతున్నారు. శుక్రవారం కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని నిర్ణయించింది. వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఆరు నెలలకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లు ఒకసారి రిజిస్ట్రేషన్ చార్జీలు సవరిస్తారు. గత ప్రభుత్వంలో ఈ విధానం అమలు చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ధరలు సవరించడంతో చాలాచోట్ల 15 నుంచి 20 శాతం వరకు చార్జీలు పెరిగే అవకాశం ఉంది.