ఈ వీడియో చూస్తే కన్నీరు ఆగదు

ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతులు పంట చేతికి అందిన సమయంలో ఊసూరుమంటున్నారు.

Update: 2024-12-24 08:30 GMT

ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతులు పంట చేతికి అందిన సమయంలో ఊసూరుమంటున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల ధాన్యం తడిసిపోతున్నాయి. కోత కోసి పంట నూర్పులు అయిన తర్వాత ధాన్యం బస్తాలకు ఎత్తి ఇంటికి తీసుకురావాల్సిన సమయంలో ముసురు దెబ్బతో రైతు కష్టం వర్షార్పణమైంది.

గత వారం రోజులుగా ఏపీని వర్షాలు వదలడం లేదు. ముఖ్యంగా కోస్తాలోని ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రల్లో అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పంట పొలాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైపోతున్నాయి. పంట చేతికి అందిన సమయంలో కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే ధాన్యంలో తేమశాతం ఏ మాత్రం ఎక్కువ ఉన్నా, అధికారులు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. ఇప్పుడు పూర్తిగా తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలో తెలియక రైతులు లబోదిబో మంటున్నారు.

ప్రకృతి పగబట్టినట్లు డిసెంబర్ నెలలో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా ఈ కాలంలో వర్షాలు కురిసే అవకాశాలు చాలా తక్కువ. కానీ, బంగాళాఖాతంలో వాయుగుండాలు, అప్పపీడనాలతో ఈ నెలలో ఎక్కువ రోజులు వర్షాలే కురిశాయి. దీంతో ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో కోతలు పూర్తి చేసిన రైతులు వరి కుప్పలను పొలాల్లో ఉంచారు. మరికొందరు నూర్పులు పూర్తిచేసి ధాన్యాన్ని బస్తాలకు ఎత్తి మిల్లులకు తరలించడానికి సిద్ధం చేశారు. ఇలాంటి సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులను వేదనకు గురిచేస్తున్నాయి.

గత వారం రోజులుగా ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో అప్పపీడనం కొనసాగుతుండటం వల్ల మరికొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది ఎప్పటికి బలహీనపడుతుందనే విషయమై వాతావరణ శాఖ అధికారులకు క్లారిటీ లేదు. దీంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. మంగళ, బుధవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాతోపాటు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో పలు పంట పొలాల్లో ధాన్యం బస్తాలు తడిసిపోయి నీరు కారుతోంది.

ఇక అల్పపీడన ప్రభావంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, క్రిష్ణపట్నం ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Tags:    

Similar News