40 కేజీల గ్రేనేడ్లు విసిరినా ఆ వంతెన డ్యామేజ్ కాదంతే!
ఇంజినీరింగ్ అద్భుతంగా మారింది 338కిలోమీటర్ల ఉద్దమ్ పూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్వే లైన్. దీని నిర్మాణం దాదాపుగా పూర్తైంది.
ఇంజినీరింగ్ అద్భుతంగా మారింది 338కిలోమీటర్ల ఉద్దమ్ పూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్వే లైన్. దీని నిర్మాణం దాదాపుగా పూర్తైంది. పాతికేళ్ల నాటి ప్రణాళిక పట్టాలెక్కుతున్న వైనం.. ఇరవైఏళ్లుగా దీన్ని నిర్మిస్తున్నారు. కశ్మీర్ ను దేశంతో అనుసంధానిస్తూ మన రైల్వేల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా ఈ రైల్వే లైన్ నిలవనుంది. దగ్గర దగ్గర రూ.41 వేల కోట్లతో చేపట్టిన ఈ రైల్వే లైన్ ను వచ్చే ఏడాది జనవరిలో (2025) ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు నిర్మించిన రైల్వే లైన్ కు మరో 17 కి.మీ. మేర రైల్వే లైనును నిర్మించాల్సి ఉంది.
పెండింగ్ ట్రాక్ ఉన్న ప్రాంతంలో హిమాలయ పర్వతాలు అత్యంత సంక్లిష్టంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తర్వాత దీని పనుల్ని పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఆజింఖడ్ కేబుల వంతెనకు అవతల ఒక సొరంగాన్ని నిర్మించి.. ఆ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో.. ఈ ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమంటే.. ఉద్దమ్ పూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన 111 కిలోమీటర్ల కట్రా - బనిహల్ లైన్ నిర్మాణాన్ని రైల్వే శాఖ పూర్తి చేసింది.
దీని ప్రత్యేకత ఏమంటే.. అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలు.. లోతైన లోయలు.. అతి వేగంగా ప్రవహించే నదులతో కూడుకున్న ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో 38 సొరంగాలు ఉన్నాయి. వాటిల్లో 27.. ఈ లైన్ లోనే ఉన్నాయి. అంతేకాదు.. 37 వంతెనల్ని ఈ లైన్ లో నిర్మించారు. వీటిల్లో ప్రధానమైనది చెనాబ్ ... ఆంజిఖడ్ వంతెనలు ఉన్నాయి. హిమాలయ ప్రాంతాల వాసులకు రైలు రవాణాను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా కొత్తగా కొన్ని రైల్వే స్టేషన్లను నిర్మించారు. ఆ స్టేషన్లు ఏవంటే..
- రియాసీ
- బక్కల్
- దుగ్గా
- సావల్ కోట్
- సంగల్ దాన్
- సుంబుర్
- ఖరీ
ఈ కొత్త రైల్వే స్టేషన్ల ప్రత్యేకత ఏమంటే.. వీటి నిర్మాణం కోసం హిమాలయాలను తొలిచి ప్రత్యేకంగా.. ఎత్తైన ప్రదేశాలు.. సొరంగాల వద్ద ఈ రైల్వే స్టేషన్లను నిర్మించారు. పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 45 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన చెనాబ్ వంతెన పలు జాగ్రత్తలు తీసుకున్నారు. వంతెన సమీపానికి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనుక్షణం సీపీకెమెరాల నిఘాతో కంట్రోల్ రూం ఏర్పాటైంది.
అంతేకాదు.. ఇక్కడ ఒక్కో బెల్టును రూ.500 ఖరీదు చేసేవి ఏర్పాటు చేశారు. ఒకసారి బిగించిన తర్వాత ఇతరులు విప్పలేని రీతిలో తయారు చేసిన భారీ బోల్టులు వంతెన నిర్మాణంలో ప్రత్యేకంగా వాడారు అంతేకాదు.. సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో ఒక వేళ గ్రెనేడ్ దాడి జరిగినా.. 40 కేజీల గ్రెనేడ్లు విసిరినా వంతెన ధ్వంసం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వంతెనపై ఒక అడుగు ఎత్తులో ఇనుప జాలీని అమర్చారు. దీంతో.. గ్రెనేడ్లు విసిరినా వంతెన ధ్వంసం కాదు. ఇనుప జాలీలు గ్రెనేడ్లను అడ్డుకుంటాయి.
కట్రా - రియాసీ సెక్షన్ లో అంజీఖడ్ వద్ద దేశంలోనే తొలి రైల్వే కేబుల్ వంతెనను నిర్మించారు. భూకంపాలు.. వరదలు.. విపత్తులు విరుచుకుపడే అస్కారం ఉన్న ఈ ప్రాంతంలో రెండు కొండలను అనుసంధానిస్తూ కేబుల్ వంతెన నిర్మాణమే సరైన పరిష్కారంగా భావించి ఏర్పాటు చేశారు. ఐఐటీ ఢిల్లీ.. ఐఐటీ రూర్కీ సాంకేతిక సహకారంతో 725.5 మీటర్ల వంతెనను నిర్మించారు.
ఇందులో 290 బలమైన కేబుల్ వైర్లతో నిర్మించిన వంతెన 473.25 మీటర్ల పొడవు ఉంటుంది. చలికాలంలో పట్టాలపై మంచు గడ్డ కట్టకుండా ఉండేందుకు వీలుగా డబుల్ వాల్ట్ కాంపోజిట్ ఇన్సులేటెడ్ వాటర్ ట్యాంకులు అమర్చారు. దీంతో పట్టాలపై చేరే నీరు ద్రవ రూపంలో ఉంటుంది. చలికి గడ్డ కట్టదు. రైళ్లకు నీళ్ల సరఫరా కోసం రక్షణ శాఖ సహకారంతో హీటెడ్ పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ రూట్ లో ప్రయాణించే రైళ్లలో టాయిలెట్లలో గీజర్ల సదుపాయం ఉంటుంది. అంతేకాదు.. సెంట్రల్ హీటెడ్ స్లీపర్ వందే భారత్ రైళ్లను ఈ లైన్ లో నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇదంతా చదివిన తర్వాత.. ఈ రూట్ లో అర్జెంట్ గా ట్రైన్ జర్నీ చేయాలనిపించట్లేదు?