రూ.13,592 కోట్లతో రాజధాని పనులు

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే దిశగా చర్యలు తీసుకోవాలని షరతులు విధించింది.

Update: 2024-12-21 05:42 GMT

ఏపీ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు భారీ రుణ ప్యాకేజీ ప్రకటింది. ఆరేళ్లలో రూ.13,592 కోట్ల రూపాయలను రుణంగా అందజేయనుంది. విడతల వారీగా విడుదల చేయనున్న ఈ నిధుల్లో తొలి దఫా కింద వచ్చే నెల 348 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. మొత్తం రుణంలో సగం రూ.6,796 కోట్లు ప్రపంచ బ్యాంకు ఇవ్వనుండగా, మిగిలిని రూ. 6,796 కోట్లు ఆసియా అభివృద్ధి బ్యాంకు సమకూర్చనుంది. ఈ నిధులతో రాజధాని పనులు చకచకా జరిగే అవకాశం ఉంది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రపంచ బ్యాంకు పలు షరతులు విధించింది. పౌర సేవలతోపాటు స్థానిక పరిపాలన, ఉద్యోగాల కల్పన, సుస్థిర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలను విధించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే దిశగా చర్యలు తీసుకోవాలని షరతులు విధించింది.

అమరావతి నిర్మాణానికి భారీ రుణం మంజూరు చేసిన ప్రపంచ బ్యాంకు నిధులను ఎప్పుడెప్పుడు విడుదల చేసేది స్పష్టం చేస్తూ ఓ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ కాపీని సీఆర్డీఏకి పంపింది. అంతేకాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాజధాని పనులు పరిశీలిస్తామని, అంతా సంతృప్తికరంగా ఉంటేనే మలివిడత నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా రాజధాని టెండర్ల ప్రక్రియను వరల్డ్ బ్యాంకు పరిశీలించనుంది. ఇప్పటికే టెండర్ నిబంధనలను అధ్యయనం చేసింది. టెండర్ ప్రక్రియ మొదలైన నుంచి క్షేత్రస్థాయిలో పనుల వరకు అన్నింటినీ ప్రపంచ బ్యాంకు అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపింది.

ఈ మొత్తం రుణంలో రూ.6,796 కోట్లను ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కనెస్ట్రక్షన్ (ఐబీఆర్డీ) విభాగం ద్వారా ప్రపంచ బ్యాంకు అందస్తోంది. మిగిలిన సగాన్ని ఏడీబీ ఆరేళ్ల కాలపరిమితితో ఇవ్వనుంది. 2026 జనవరిలో రూ.849 కోట్లు, 2027 జనవరిలో రూ.1,121 కోట్లు, 2028లో 1,571 కోట్లు, 2029లో 1,852 కోట్లు, 2030లో 1,053 కోట్లు చొప్పున నిధులు కేటాయించనున్నారు.

Tags:    

Similar News