ఏపీ బీజేపీ ఆరుగురు అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరం

పక్కా అనుకున్నోళ్లకు టికెట్ ఇవ్వని బీజేపీ.. బరిలో ఉండరని భావించిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

Update: 2024-03-25 06:00 GMT

పక్కా అనుకున్నోళ్లకు టికెట్ ఇవ్వని బీజేపీ.. బరిలో ఉండరని భావించిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఆదివారం రాత్రి విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఏపీకి సంబంధించి ఆరుగురు అభ్యర్థులను ఎంపికలో కొన్ని సిత్రాలు చోటు చేసుకున్నాయి. అందులో మొదటిది.. నరసాపురం ఎంపీ స్థానానికి సిట్టింగ్ ఎంపీగా వ్యవహరిస్తున్న రఘురామ రాజు (వైసీపీ రెబల్)కు టికెట్ ఇవ్వని బీజేపీ అధినాయకత్వం అస్సలు అంచనా లేని ముగ్గురిని ఎన్నికల బరిలోకి దింపటం ద్వారా ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎన్నికల బరిలో ఉండే అవకాశమే ఉండదని భావించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మకు నరసాపురం బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా తిరుపతి నుంచి గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ ను.. రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రాజమహేంద్రవరం ఎంపీ స్థానాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న పురందేశ్వరికి కేటాయించగా.. అరకు ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు కేటాయించారు. ఇక.. అనకాపల్లి స్థానాన్ని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రకటించిన ఆరుగురు అభ్యర్థుల్లో నరసాపురం అభ్యర్థి మినహా మిగిలిన ఐదుగురు గతంలో చట్ట సభల్లో అనుభవంలో ఉన్నవారే కావటం గమనార్హం.

మరో ఆసక్తికర అంశం ఏమంటే..తాజాగా ప్రకటించిన ఆరుగురు బీజేపీ అభ్యర్థుల్లో ఒకరు మాజీ ముఖ్యమంత్రి అయితే.. మరొకరు కేంద్ర మాజీ మంత్రి.. ఇద్దరు మాజీ ఎంపీలుగా వ్యవహరించిన వారు. ఒకరు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నుంచి ఎంపీ టికెట్లు ఆశించి భంగపడిన వారిలో మాజీ ఎంపీ సుజనా చౌదరి.. రిటైర్డు ఐఏఎస్ అధికారులు రత్నప్రభ.. దాసరి శ్రీనివాసులు ఉన్నారు.

నిజానికి పొత్తులో భాగంగా టీడీపీ.. జనసేన.. బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం విజయనగరం ఎంపీ స్థానం బీజేపీకి.. రాజంపేట స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. అయితే.. కిరణ్ కుమార్ రెడ్డి కోసం రాజంపేట సీటును తమకు ఇవ్వాలని బీజేపీ అడగటంతో.. టీడీపీ అందుకు అంగీకరించి విజయనగరం స్థానాన్ని తాను తీసుకుంది. తాజాగా ప్రకటించిన ఆరుగురు బీజేపీ ఎంపీ అభ్యర్థుల్లో వెలగపల్లి వరప్రసాద్ రావు ఎంపిక అనూహ్యంగా చెప్పాలి. ఎందుకుంటే ఆయన ఆదివారం ఉదయం బీజేపీలో చేరారు. సాయంత్రానికి తిరుపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ జాబితాలో పేరు వచ్చింది.

Tags:    

Similar News