ఏపీ బీజేపీ తీరే వేరు
కేంద్రం పిలుపు మేరకు హర్‌ఘర్ తిరంగా యాత్రను జనసేన నాయకులు కూడా గురువారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు
ఏపీ బీజేపీ నాయకులు తమ బుద్ధి పోనిచ్చుకోలేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటిపైనా జెండాను ఎగురవేయాలని సర్కారు అధికారికంగా కూడా ప్రకటించింది. అంతేకాదు.. చంద్రబాబు సైతం తన ట్విట్టర్‌లో మోడీ పిలుపును అందరూ పాటించాలని అన్నారు. ఇలా.. కేంద్రం ఇచ్చిన పిలుపును పొత్తు ధర్మంలో పాటించిన టీడీపీ.. ఆ ధర్మనికి కట్టుబడి ఉన్నామన్న సంకేతాలు పంపించింది. ఒక్క టీడీపీనే కాదు.. జనసేన కూడా.. కూటమి కట్టుబాటును పాటించింది.
కేంద్రం పిలుపు మేరకు హర్‌ఘర్ తిరంగా యాత్రను జనసేన నాయకులు కూడా గురువారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు. జనసేన కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై జెండాలు ఎగురవేసి మోడీ పిలుపును సాకారం చేశారు. అయితే.. ఈ రెండు పక్షాలు పొత్తు ధర్మాన్ని ఇంతగా పాటించినా.. కూటమి సర్కారులో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం ఆ ధర్మాన్ని ఎక్కడా పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పొత్తులో ఉన్నప్పుడు.. ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు సర్కారు చేపట్టిన కార్యక్రమాలకు బీజేపీ నాయకులు కూడా మద్దతుగా నిలవాలి.
ప్రభుత్వం పిలుపునిచ్చే కార్యక్రమాలకు అండగా ఉండాలి. వాటిని ముందుకు తీసుకువెళ్లాలి. కానీ, ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఎంతెంత దూరం.. అంటే చాలా చాలా దూరం! అన్నట్టుగా పొత్తు ధర్మానికి దూరంగా ఉండిపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను సంబరాల మధ్య ప్రారంభించాలని పిలుపునిచ్చారు. దీనికి పేరు పెట్టి పిలవకపోయినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు `అందరూ` హాజరు కావాలని సీఎం చంద్రబాబు స్వయంగా కోరారు. దీంతో అందరూ హాజరవుతారని అనుకున్నారు.
అయితే.. టీడీపీ మంత్రులతోపాటు జనసేనకు చెందిన మంత్రులు కొందరు, ఎమ్మెల్యే లు మరికొందరు హాజరయ్యారు. కానీ, ఎటొచ్చీ.. బీజేపీనాయకులు మాత్రం ఎక్కడా కనిపించలేదు. వాస్తవానికి బీజేపీకికూటమి సర్కారులో ఒక మంత్రి ఉన్నారు. మరో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా అన్న క్యాంటీన్ల సంబరాల్లో పాలుపంచుకోకపోవడం గమనార్హం. మరి ఈ కార్యక్రమంతో తమకు సంబంధం లేదని అనుకున్నారా? లేక.. ఇది తమది కాదని భావించారో తెలియదు కానీ.. బీజేపీ మాత్రం తన బుద్ధిని పోనిచ్చుకోలేదని అంటున్నారు పరిశీలకులు.