జనం లేరు.. నాయకులు లేరు ఏపీ పీసీసీ చీఫ్ పరిస్థితి ఏమిటో?

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాస్త పట్టు నిలిచినా.. ఏపీలో మాత్రం కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతిన్నది

Update: 2024-01-06 00:30 GMT
జనం లేరు.. నాయకులు లేరు ఏపీ పీసీసీ చీఫ్ పరిస్థితి ఏమిటో?
  • whatsapp icon

ఇప్పుడంటే ఎవరికీ పెద్దగా పట్టడం లేదు కానీ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు అంటే చాలా పెద్ద పదవి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గనుక ఏపీసీసీ చీఫ్ మరింత పవర్ ఫుల్. ముఖ్యమంత్రి పదవి దక్కని కాంగ్రెస్ నాయకులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేసేవారు. అంతెందుకు..? తెలంగాణలో మొన్నటివరకు టీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దాదాపు పది మంది నాయకులు పోటీ పడ్డారు. అన్నిరకాలుగా సమర్థుడైనందున రేవంత్ రెడ్డికి పగ్గాలు దక్కాయి. దీనికితగ్గట్లే ఆయన పార్టీని గెలింపిచారు.

ఏపీకి ఉన్నారో చీఫ్

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాస్త పట్టు నిలిచినా.. ఏపీలో మాత్రం కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతిన్నది. ఒకవిధంగా చెప్పాలంటే.. మరో వందేళ్లయినా ఏపీలో కాంగ్రెస్ గెలవదు. అడ్డగోలు విభజన.. రాజధాని కూడా లేకుండా చేసినందుకు ఆ పార్టీ అనుభవిస్తున్నది. కాగా.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ పీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్ వ్యవహరించారు. వీరిద్దరూ అనంతపురం జిల్లాకు చెందినవారే. ఒకరు బీసీ కాగా.. మరొకరు ఎస్సీ నాయకులు. సామాజిక సమతుల్యత, బహుజనులకు పెద్దపీట వేసినట్లు కనిపించినా.. ఒకే జిల్లా వారు కావడం ఎంపికలో లోపమే. కాగా, 2022లో ఏపీ పీసీసీ చీఫ్ గా కోనసీమకు చెందిన గిడుగు రుద్రరాజును నియమించారు. అగ్ర వర్ణానికి చెందిన రుద్రరాజు ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే, క్షేత్ర స్థాయిలో పట్టున్న నాయకుడు కాదు.

వైఎస్ షర్మిల రాకతో..

ఇక ఇప్పుడు వైఎస్ షర్మిల రాకతో ఏపీ రాజకీయాలు మలుపు తిరగనున్నాయి. ఆమెకు పీసీసీ చీఫ్ పదవి అప్పగిస్తారనే కథనాలు వస్తున్నాయి. అదే నిజమైతే గనుక రుద్రరాజును తప్పించాల్సి ఉంటుంది. ఆయనను కొనసాగిస్తూ.. షర్మిలను ప్రోత్సహించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అంటే.. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు ఇస్తేనే ఆమెను చేర్చుకున్నందుకు ప్రయోజనం. మరి అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.

కొసమెరుపు ఏమంటే.. ఏపీలో కాంగ్రెస్ గుండు సున్నా.. అంటే జనం లేరు.. కనీసం రెండు మూడు శాతం ఓట్లు కూడా రావు. ఇక నాయకులూ లేరు. ఉన్నవారికి జనం ఓట్లేసే పరిస్థితి కనిపించడం లేదు. మిగతావారు ప్రజల్లోకి వెళ్లేంత డైనమిజంతో లేరు. ఈ పరిస్థితుల్లో ఏపీసీసీ చీఫ్ గా ఎవరున్నా.. చేసేదేమీ లేదు. ఎన్నికల్లో పరాజయం అనే పరాభవం తప్ప.

Tags:    

Similar News