వైజాగ్ రిపీట్ అవ్వాలంటున్న జగన్... ఎవరీ అప్పలనాయుడు?

ఈ మేరకు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును ఖరారు చేసింది.

Update: 2024-11-06 11:12 GMT

ఏపీలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు కార్యక్రమం పై పార్టీలు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల దరఖాస్తు ప్రక్రియకు నేడే చివరి తేదీ! ఈ నేపథ్యంలో విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని వైసీపీ ఖరారు చేసింది.

అవును... విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని వైసీపీ ఖరారు చేసింది. ఈ మేరకు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును ఖరారు చేసింది. ఈ మేరకు.. బుధవారం పార్టీ నాయకులతో సమావేశమైన జగన్.. వారందరిని అభిప్రాయాలనూ తీసుకుని అప్పల నాయుడి పేరును ప్రకటించారు.

ఇటీవల జరిగిన విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చిన జగన్.. ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడి పేరును ప్రకటించారు. స్థానిక నేతలంతా ఈ పేరును బలపరచడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

కాగా... విజయనగరం జిల్లాల్లోని స్థానిక సంస్థలకు చెందిన ప్రతినిధుల సంఖ్య 753 కాగా... ఇందులో 592 మంది వైసీపీ నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులుగా గెలుపొందినవారు ఉన్నారు! దీంతో... విశాఖ ఎమ్మెల్సీని గెలుచుకున్నట్లే సమిష్టి కృషితో విజయనగరం ఎమ్మెల్సీని గెలిపించుకొవాలని జగన్ పిలుపునిచ్చారు.

ఇక... సుమారు నాలుగు దశాబ్ధాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్న చిన అప్పల నాయుడు.. బొబ్బిలి నుంచి 4 సార్లు (1983, 1985, 1994, 2019) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో... 2019లో ప్రోటెం స్పీకర్ గానూ పనిచేశారు.

Tags:    

Similar News