ప్రతి నేత జైలుకు వెళ్తారు.. వెళ్లాలి.. ఆసక్తికరంగా అసద్ మాట
పాతబస్తీలో రూ.700 కోట్ల పైచిలుకు ఖర్చుతో నిర్మించిన భారీ ఫ్లైఓవర్ ను ఎట్టకేలకు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పాతబస్తీలో రూ.700 కోట్ల పైచిలుకు ఖర్చుతో నిర్మించిన భారీ ఫ్లైఓవర్ ను ఎట్టకేలకు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నింటికి మించి ప్రతి నేత జైలుకు వెళ్తారు.. వెళ్లాలంటూ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు సంచలనంగా మారాయి. అంతేకాదు ఇంకా ఎందరు జైలుకు వెళ్తారో అంటూ అసద్ వ్యాఖ్యలు అసాంతం ఆసక్తికరంగా మారాయి. తన నోటి నుంచి వచ్చే మాటల్లో ద్వందార్థాలు లేవని స్పష్టంచేసినప్పటికి ఆయన చేసిన వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే.. మాత్రం చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయని మాత్రం చెప్పక తప్పదు.
‘రాజకీయ నాయకులు జైలుకు వెళ్తారు.వెళ్లాలి కూడా. ఇందులో ద్వందార్థం లేదు. నేనూ చంద్రబాబు హయాంలో 50 రోజులు జైల్లో ఉన్నా. ప్రతి రాజకీయ నేత ఏదో సందర్భంలో జైలుకు వెళ్తాడు. వెళ్లినప్పుడే కష్టాలు తెలుస్తాయి. ఇంకా ఎంత మంది వెళ్తారో తెలీదు’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని మర్చిపోయే వ్యక్తి కాదని.. జైల్లో తనకు వంట వండి పెట్టిన వ్యక్తితో ఫోటో తీసుకున్న విషయాన్ని ఇటీవల ఒక మీడియా ప్రతినిధి తనతో చెప్పినట్లుగా పేర్కొన్నారు.
జైల్లో వెంట ఉన్న వ్యక్తినే రేవంత్ మర్చిపోలేదని.. రాజకీయ నేతలు ఇలానే ఉండాలన్నారు. తాజాగా పలు అంశాలకు సంబంధించి ఏసీబీ.. ఈడీ విచారణ ఎదుర్కొంటున్న పలువురు నేతలు.. ఆయా దర్యాప్తు సంస్థల చుట్టూ.. కోర్టు చుట్టూ తిరుగుతున్న వేళలో.. అసద్ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పాలి.