రాజు గారి రాజకీయం ముగిసినట్లేనా ?

రాజకీయాల్లో ఆ పెద్దాయన ఎవరో కాదు విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు.;

Update: 2025-03-07 00:30 GMT

దాదాపుగా అర్ధ శతాబ్దం రాజకీయం ఆయన సొంతం. 1970 దశకం నుంచి రాజకీయాల్లో చురుకుగా పాలుపంచుకున్న ఆయనకు ఇపుడు రాజకీయంగా కంపల్సరీ రిటైర్మెంట్ ఎదురైందా అన్న చర్చ సాగుతోంది. రాజకీయాల్లో ఆ పెద్దాయన ఎవరో కాదు విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు.

ఆయన పూసపాటి రాజవంశీకుడు, కాంగ్రెస్ తొలితరం నాయకుడు అయిన పీవీజీ రాజు కుమారుడు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి జనతా పార్టీ ద్వారా అరంగేట్రం చేశారు 1977 ఎమర్జెన్సీ టైం నుంచే అశోక్ రాజకీయం స్టార్ట్ అయింది. అలా ఆయన 1978లో విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. 1983 నాటికి టీడీపీలో చేరి కీలకంగా మారారు. మంత్రిగా అనీక కీలక శాఖలను చూశారు.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా సమకాలీనుడుగా టీడీపీలో అశోక్ ప్రభ ఒక వెలుగు వెలిగింది. ఆయన కేంద్ర మంత్రిగా కూడా నాలుగేళ్ళకు పైగా కేబినెట్ ర్యాంక్ తో పనిచేశారు. 2024లో ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు. కుమార్తె అదితి గజపతిరాజుకు విజయనగరం అసెంబ్లీ సీటు ఇచ్చారు. ఆమె గెలిచారు. అయితే ఆనవాయితీ ప్రకారం అశోక్ కుటుంబానికి దక్కాల్సిన మంత్రి పదవి అయితే రాలేదు.

ఇక ఎంపీగా పోటీ చేయని అశోక్ కి రాజ్యసభ సీటు ఇస్తారని అనుకున్నారు. ఆ విధంగా కొన్నాళ్ళ పాటు ప్రచారం సాగింది. కానీ అదేమీ లేదని తేలిపోయింది. ఇక కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కాబట్టి టీడీపీ కోటాలో దక్కే గవర్నర్ పోస్టుకు అశోక్ గజపతి రాజు పేరుని పరిశీలిస్తారు అని కూడా అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు.

దాంతో రాజు గారు పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్ళారని అంటున్నారు. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడుపుతున్నారని అంటున్నారు. ఆయన తన కుమార్తెకు రాజకీయ సలహాలు ఇస్తూ ఆమెను మంచి లీడర్ గా చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరో విషయం ఏంటి అంటే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అశోక్ పెద్దగా అధినాయకత్వాన్ని కలిసింది లేదని అంటున్నారు.

ఆయనకు పదవులు వాటంత అవే దక్కాయి. ఆయన ఏ రోజూ వాటిని కోరుకోలేదని అంటున్నారు. ఇక రాజకీయంగా ఎంతో సీనియర్ అయి ఉండి టీడీపీకి సుదీర్ఘ కాలం సేవ చేసిన నేతగా అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కితే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. అలా కాకున్నా ఆయన మేధస్సుకు తగిన స్థానంగా రాజ్యసభలో అయినా ఉంచాలని అంటున్నారు.

అయితే తెలుగుదేశంలో కొత్త పోకడలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. కొత్త వారికి యువతకు పెద్ద పీట వేస్తున్నారు. సీనియర్లను పక్కన పెడుతున్నారు. దాంతో ఏడు పదులు దాటిన అశోక్ లాంటి వారికి అవకాశాలు ఇవ్వాలనుకుంటేనే ఇస్తారు. లేదా పార్టీ పాలసీ ప్రకారం ముందుకు పోతారని అంటున్నారు.

ఈ విషయాలను అన్నీ గమనించిన మీదటనే అశోక్ గజపతిరాజు మౌన ముద్రలో ఉంటున్నారు అని అంటున్నారు. ఈ రాజకీయ జీవితానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ అని ఆయనకు ఆయనే పెట్టేసుకున్నారా అంటే తెలియదు కానీ విజయనగరం జిల్లాలో టీడీపీని పునాదుల నుంచి బలోపేతం చేసిన పెద్దాయనకు తగిన పదవితో గౌరవిస్తే బాగుంటుంది అన్నది జిల్లా వాసుల కోరికగా కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News