అతిషీ ఆరు నెలల సీఎం
ఆ ఎన్నికల్లో ఉల్లి ధరల పెరుగుదలతో బీజేపీ ఓటమి పాలు కావాల్సి వచ్చింది.
ఢిల్లీలో మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషీ రికార్డు క్రియేట్ చేయనున్నారు. ఆమె కంటే ముందు ఇద్దరు మహిళలు ఈ పీఠం అధిరోహించారు. ఢిల్లీ మొదటి మహిళా సీఎం గా బీజేపీకి చెందిన సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ 1998 అక్టోబర్ 12 నుంచి 1998 డిసెంబర్ 3 వరకూ మొత్తం 52 రోజులు పాటు పాలించారు. ఆ ఎన్నికల్లో ఉల్లి ధరల పెరుగుదలతో బీజేపీ ఓటమి పాలు కావాల్సి వచ్చింది.
ఇక ఆ ఈన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అలా కాంగ్రెస్ నుంచి మరో మహిళా సీఎం షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె సుష్మా నుంచి చార్జ్ తీసుకున్నారు. షీలా దీక్షిత్ 1998 డిసెంబర్ 3 నుంచి 2013 డిసెంబర్ 28 వరకూ అంటే ఏకంగా మూడు టెర్ములు 15 సంవత్సరాల 25 రోజుల పాటు పాలించారు. ఇది రికార్డు గానే చూడాల్సి ఉంది.
ఇక ఇపుడు ఆప్ నుంచి అతిషీ లేడీ సీఎం గా వస్తున్నారు. ఆమీ కనీసంగా ఆరు నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. ఢిల్లీ శాసన సభ పదవీ కాలం 2025 ఫిబ్రవరి వరకూ ఉంది. ఆ విధంగా చూస్తే అప్పటి దాకా అతిషీ సీఎం గానే ఉంటారు. ఇక ఆప్ కి అసెంబ్లీ రద్దు చేయాలన్న ఆలోచన లేదు. అలా చేస్తే నవంబర్ లో జార్ఖండ్ మహారాష్ట్రలతో ఎన్నికలు వస్తాయని అనుకున్నారు.
కానీ ఆప్ కి చెందిన నేతలు మాత్రం తాము పూర్తి కాలం అధికారంలో ఉంటామని చెబుతున్నారు. దీంతో అతిషీ పూర్తి బాధ్యతలతోనే ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఆప్ అధినేత హోదాకే అరవింద్ కేజ్రీవాల్ పరిమితం కానున్నారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టి జనంలో ఉంటారు అని అంటున్నారు.
సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసినా ఆయన ముఖ్యమంత్రి ఆఫీసుకుని వెళ్ళకూడదని షరతులు ఉన్నాయి. దాంతో ఆయన సంతకాలు చేయకుండా పాలన సాగకుండా ఎలా అన్న ప్రశ్న ఉంది. ఆ చిక్కు ముడిని విప్పేందుకే తనకు అత్యంత విధేయురాలు అయిన అతిషీని ఆయన ఎన్నుకున్నారు.
ఇక అతీషీ గురించి చూస్తే కనుక ఆమె పూర్తి పేరు అతిషి మర్లేనా సింగ్ 1981 జూన్ 8న ఢిల్లీలో పుట్టారు. ఆమె వయసు 43 ఏళ్ళు. ఆమె ఆప్ పార్టీలో 2013లో చేరారు. ఆమె 2015 నుండి 2018 వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ప్రాథమికంగా విద్యపై సలహాదారుగా పనిచేశారు. ఆమె పార్టీలో చురుకుగా ఉండేవారు.
దాంతోనే ఆమెకు 2020లో కేర్జీవాల్ టికెట్ ఇచ్చారు. అలా ఆమె ఢిల్లీలోని కల్కాజీ శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచి వచ్చారు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఈ టెర్మ్ లోనే ఆమె కీలక మంత్రిత్వ శాఖలను చూస్తున్నారు. ఆమె అరవింద్ కేజ్రీవాల్ జైలు లో ఉన్నపుడు పార్టీ తరఫున ప్రభుత్వం లో నూ ఉంటూ బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు.
దానితో పాటు ఆమె కేజ్రీవాల్ కి వీర విధేయురాలు. అందుకే ఆమెకే కేజ్రీవాల్ పట్టం కట్టారు. తాను మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ని సీఎం పీఠం మీద కూర్చోబెట్టే లక్ష్యం కోసమే సీఎం పదవిలో ఉంటాను అని ఆమె ప్రకటించడం బట్టి చూస్తే ఆమెకు ఈ పదవి ఎందుకు ఇచ్చారు అన్నది అర్ధం అవుతుంది.
మొత్తానికి కేజ్రీవాల్ సతీమణికి పట్టం కడతారు అని అంతా అనుకున్నారు. కానీ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగానే అతిషీని ఈ పదవిలో కూర్చోబెట్టారు అని అంటున్నారు. ఇక తాను సీఎం పదవిని వదులుకోవడానికైనా సిద్ధం అని జానాలకు చెప్పడంతో పాటు తన నిజాయతీ ఇదీ అని రుజువు చేసుకునే ఎత్తుగడతోనే ఆయన ఇదంతా చేసారు అని అంటున్నారు. మరి కొద్ది రోజులలో అతిషీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె కేబినెట్ లో మొత్తం కేజ్రీవాల్ మంత్రివర్గం అంతా ఉంటుంది అని అంటున్నారు.