జనసేన నేత బార్‌పై దాడి.. పేర్ని ఫ్యామిలీపై విమర్శలు
తాజాగా మంగళవారం రాత్రి.. జనసేన నాయకుడికి చెందిన బార్‌పై మాజీ మంత్రి పేర్ని నాని అనుచరు లు.. దాడి చేసినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
జనసేన నాయకులపై దాడులు ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. ఆ పార్టీకి చెందిన నాయకుల వ్యాపారాల పై మాత్రం దాడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జనసేనకు బలం ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరఫున నాయకులు పోటీ చేసినా .. చేయకపోయినా టీడీపీ లేదా బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు ప్రకటిస్తు న్నారు. ఇది వైసీపీ నేతలకు కంటగింపుగా మారిన విషయం తెలిసిందే. దీంతో కొన్నాళ్లుగా కవ్వింపు చర్యలు తెరమీదికి వస్తున్నాయి.
తాజాగా మంగళవారం రాత్రి.. జనసేన నాయకుడికి చెందిన బార్‌పై మాజీ మంత్రి పేర్ని నాని అనుచరు లు.. దాడి చేసినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. మచిలీపట్నం గత 10 సంవత్సరాలుగా జనసేనకు చెందిన కొరియర్ శ్రీను అనే వ్యక్తి బార్ నిర్వహిస్తున్నారు. ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. మచిలీపట్నం టికెట్‌ను కూడా ఆశించారు. అయితే.. ఇది టీడీపీకి కంచుకోట కావడంతో ఆ పార్టీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకే టికెట్ ఇచ్చింది.
దీంతో సర్దుకు పోయిన కొరియర్ శ్రీను.. టీడీపీ నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా జనసేన-టీడీపీ జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఇది.. పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుకు ఇబ్బందిగా మారింది. వైసీపీ తరఫున కిట్టు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే తమ బార్‌పై మంగళవారం రాత్రి దాడి చేశారని కొరియర్ శ్రీను ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో బార్ మేనేజర్ సహా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించామని శ్రీను తెలిపారు.
అంతేకాదు, గత ఆరు మాసాలుగా తమను పేర్ని ఫ్యామిలీ టార్గెట్ చేసిందని.. అన్ని విధాలుగా వేధిస్తు న్నారని కొరియర్ శ్రీను వివరించారు. అనేక కేసులు పెట్టారని.. పార్కింగ్ విషయంలో దాడులు చేస్తున్నా రని ఆరోపించారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదులు ఏసినా.. పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. ఇక, ఈ ఘటనపై పేర్ని వర్గం స్పందించలేదు.