అయోధ్య అతలాకుతలం !

అయోధ్య రామాలయం కోసం రూ. 311 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘రామ్‌పథ్’ కుంగిపోయింది

Update: 2024-06-30 09:48 GMT

చిన్న వర్షానికే అయోధ్య బాలరాముడి గర్భాలయంలోకి వర్షపునీళ్లు వచ్చిన విషయం మరిచిపోకముందే మరో వర్షానికి అయోధ్య అతలాకుతలం అయింది. ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్య దాదాపు నీట మునిగి పోయింది.

అయోధ్య రామాలయం కోసం రూ. 311 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘రామ్‌పథ్’ కుంగిపోయింది. రామమందిరానికి దారితీసే 14 కిలోమీటర్ల రోడ్డు ఆలయ గేటుకు అర కిలోమీటరు దూరంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆలయానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో 6 మీటర్ల వ్యాసార్థంతో మరో రెండు గోతులు ఏర్పడ్డాయి. అయోధ్యధామ్ రైల్వే స్టేషన్‌లో నిర్మించిన 40 మీటర్ల పొడవైన ప్రహరీ కుప్పకూలింది.

అయోధ్య వీధులు కాలువలను తలపిస్తున్నాయి. రామాలయానికి వెళ్లేందుకు భక్తులు నానా అవస్థలు పడ్డారు. మోకాలి లోతు నీరు, బురదలో అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు.

రోడ్లు కుంగిపోయి, వీధులు అస్తవ్యస్తంగా మారడంతో అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. అయోధ్యలో వర్ష భీభత్సం నేపథ్యంలో యోగి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరుగురు మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసింది. ఈ పనుల కోసం రోడ్లను దిగ్బంధించడంతో యాత్రికులు అవస్థలు పడుతున్నారు.

పలు ఇళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను వాన నీరు ముంచెత్తింది. పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ ధ్వంసమైందని, ఆలయ నిర్మాణానికి ముందు ఇలాంటి సమస్యలు ఎన్నడూ లేవని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు పూర్తిచేయడమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News