కార్యకర్తలకు మనోభావాలు ఉండవా జగన్ ?

రెండు సీట్లు ఉన్న బీజేపీ ఈ రోజు కేంద్రంలో వరసగా మూడు సార్లు గెలిచింది అంటే క్యాడర్ బేస్డ్ పార్టీ కావడమే అందుకు కారణం.

Update: 2024-12-18 16:30 GMT

మనో భావాలు ఎవరికైనా ఒక్కటే. అవి దెబ్బ తింటే ఇబ్బందే అవుతుంది. పార్టీ అన్నాక నాయకుడుతో పాటు క్యాడర్ కూడా ఉంటుంది. క్యాడర్ తోనే ఏ పార్టీ అయినా నడిచేది. రెండు సీట్లు ఉన్న బీజేపీ ఈ రోజు కేంద్రంలో వరసగా మూడు సార్లు గెలిచింది అంటే క్యాడర్ బేస్డ్ పార్టీ కావడమే అందుకు కారణం.

తమిళనాడులో డీఎంకే ఒకసారి పదమూడేళ్ళూ,మరోసారి పదేళ్ళ పాటు అధికారంలోకి రాకపోయినా బలంగా ఉంది అంటే ఈ రోజున మళ్లీ అధికారంలో ఉంది అంటే క్యాడర్ ని గౌరవించడం కారణం అని చెబుతారు. ఏపీలో చూస్తే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కార్యకర్తలకు ఎంతో విలువ ఇస్తూ వస్తోంది.

ఎన్టీఆర్ టైం నుంచి చంద్రబాబు పక్కన ఉంటూ క్యాడర్ ని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. ఈ రోజున బాబుకు తోడుగా లోకేష్ కూడా క్యాడర్ బాగోగులు పట్టించుకుంటున్నారు. వారితో నేరుగా లోకేష్ మమేకం అవుతూంటే చంద్రబాబు వారానికి రెండు సార్లు అయినా పార్టీ ఆఫీసుకు వెళ్తూ వారి నుంచి వినతులు స్వీకరిస్తున్నారు.

కార్యకర్తల అభిప్రాయాలకు చంద్రబాబు లోకేష్ ఎంతో విలువ ఇస్తున్నారు. టీడీపీలోనూ ప్రభుత్వంలోనూ ఏదైనా తప్పు జరిగింది అని కార్యకర్తలు తమ అభిప్రాయాలను చెబితే వెంటనే సరిదిద్దుకోవడానికి చంద్రబాబు లోకేష్ సిద్ధంగా ఉంటున్నారు. దిద్దుబాటు చర్యలను కూడా చేపడుతున్నారు.

ఏ పార్టీ అయినా పచ్చగా పదికాలా పాటు కొనసాగాలీ అంటే కచ్చితంగా కార్యకర్తల అభిప్రాయానికి విలువ ఇవ్వాలి. వారితోనే పార్టీ అన్న భావన తీసుకుని రావాలి. కానీ వైసీపీ తీరు మాత్రం వేరుగా ఉంది అని అంటున్నారు. జగన్ అయిదేళ్ళ పాటు సీఎం గా ఉన్నపుడు కనీసం క్యాడర్ ని దగ్గరకు రానిచ్చేవారు కాదు అన్న విమర్శలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ ఆఫీసుకు కూడా ఏ రోజూ వెళ్ళి కార్యకర్తల అభిప్రాయలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ప్రచారంలో ఉన్న మాట.

ప్రజల నుంచి క్యాడర్ నుంచి వినతిపత్రాలు స్వీకరించాలని వారి సమస్యలు తెలుసుకోవాలన్న ఆలోచన ఏనాడూ వైసీపీ అధినాయకత్వం చేయలేదని కూడా ఎత్తి చూపిస్తారు. ఇక ఘోరంగా వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత కూడా జగన్ లో ఏ మార్పూ రాలేదని అంటున్నారు.

ఎందుకు ఓడిపోయారు అంటే ఈవీఎంల మీద నిందలు వేయడం అలాగే ఏదో గోల్ మాల్ జరిగింది అని చెప్పారు తప్ప తమ పార్టీ ఓటమి మీద నిజమైన విశ్లేషణ ఆత్మ పరిశీలన ఈ రోజుకీ చేయలేదని అంటున్నారు. అదే చంద్రబాబు 2019లో ఓటమి తరువాత కార్యకర్తలను పట్టించుకోలేదని చెప్పారు. పొరపాటు జరిగిందని అన్నారు. ఇక మీదట అలా ఉండనని హామీ ఇచ్చారు. ఇపుడు అధికారంలోకి రావడంతో ఆ మాట నిలబెట్టుకుంటున్నారు.

టీడీపీలో కార్యకర్తల మాటకు ఎంతో విలువ ఉంటుందని ఆచరణలో చూపుతున్నారు. అదే వైసీపీలో దీనిని పూర్తిగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. వైసీపీలో కోటరీకే విలువ ఇస్తారు తప్ప క్యాడర్ కి కానే కాదని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే చెప్పించి చేయించారని ఇపుడు విపక్షంలోకి వచ్చినా ఆయననే రాష్ట్ర కో ఆర్డినేటర్ గా చేసి ఆయన ద్వారానే అన్నీ జరిపిస్తున్నారు అని అంటున్నారు.

దీంతో ఇదే క్యాడర్ లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. సజ్జలతో పాటు ఆయన కుమారుడు భార్గవ రెడ్డిని తెచ్చి సోషల్ మీడియా ఇంచార్జి గా చేశారని దాని ఫలితంతో ఇపుడు అనేకమంది వైసీపీ క్యాడర్ కేసులతో అరెస్టులు జైళ్లలో మగ్గుతున్నారు అని అంటున్నారు.

అయినా కూడా వైసీపీ అధినాయకత్వం లో మార్పు రాలేదని వాపోతున్నారు. సజ్జలను కోటరీని పక్కన పెట్టమని కోరుతున్నా జగన్ మాత్రం వారికే పెద్ద పీట వేస్తున్నారు అని పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.

జగన్ చుట్టూ సజ్జల, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారే కనిపిస్తారని అంటున్నారు. ఈ కోటరీ నుంచి తప్పించుకుని జగన్ ని చేరడం కష్టం అని అంటున్నారు. రేపటి రోజున వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఈ ఐదారుగురు రెడ్ల పాలనే కదా చూడాల్సింది అన్న వేడి నిట్టూర్పులు పార్టీలో ఉన్నాయి.

ఒక వైపు కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో అసంతృప్తి ఉన్నా దానిని సొమ్ము చేసుకోవడానికి జగన్ పార్టీని బలోపేతం చేయడం మానేసి కోటరీ మీద ఆధారపడడం ఎంతవరకూ సమంజసం అని అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ ఆలోచన చేయకపోతే భవిష్యత్తు మీద నీలి నీడలే నిండా కమ్ముకుంటాయని అంటున్నారు.

Tags:    

Similar News