అమరావతి : షరతులు వర్తిస్తాయంటున్న ప్రపంచ బ్యాంక్
ప్రపంచ బ్యాంక్ రుణాలతో ఈ రకమైన పక్కా విధానం అయితే ఉంటుంది.
బ్యాంకులకే బ్యాక్ ప్రపంచ బ్యాంక్. రుణాలు అంత సులువుగా ఇవ్వరు. ఇచ్చాక కూడా కడిషన్లు ఖండితంగా పెడతారు. వాటిని పాటించినట్లు అయితేనే తరువాత విడత రుణం రిలీజ్ చేస్తారు. ప్రపంచ బ్యాంక్ రుణాలతో ఈ రకమైన పక్కా విధానం అయితే ఉంటుంది.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్నది టీడీపీ కూటమి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం నిధులను వచ్చిన వెంటనే సేకరించే పనిలో పడింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి సహకరించిన టీడీపీ దానికి ప్రతిఫలంగా అభివృద్ధినే కోరుకుంటోంది.
ఏపీకి మంచి రాజధాని అందించాలని తద్వారా తన పేరుని చరిత్రలో నిలుపుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తపిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం పూచీకత్తుతో ప్రపంచ బ్యాంక్, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి.
ఈ రెండు కలిపి మొత్తం 15 వేల కోట్ల రూపాయల రుణాన్ని అమరావతి కోసం అందించనున్నాయి. ఇక ఇందులో ప్రపంచ బ్యాంకు రుణం వాటా 6,796 కోట్ల రూపాయలుగా ఉంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం వాటా 6,796 కోట్ల రూపాయల వాటాగా ఉంది.
ఇక ఈ రుణాన్ని మొత్తం ఒకేసారి రిలీజ్ చేయరు. ఏడాదికి రెండు విడతలు కింద అంటే ప్రతీ ఆరు మాసాలకు ఒక విడతగా రిలీజ్ చేస్తారు. అలా మూడేళ్ల పాటు ఈ రుణం రిలీజ్ అవుతుంది. ఇందులో ఆరు నెలల తొలి విడత నిధులుగా ప్రపంచ బ్యాక్ పెద్దలు 348.33 కోట్ల రూపాయలను జనవరి నెలలో రిలీజ్ చేస్తారు.
ఇక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైతం 348.33 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ మొదటి విడతగా జనవరిలోనే రిలీజ్ చేస్తుంది. అంటే కొత్త ఏడాది వస్తూనే ఈ రెండు రుణాలకు సంబంధించి తొలి విడతగా 696.66 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతాయి అన్న మాట.
అదే సమయంలో ప్రపంచ బ్యాంక్ అధికారులు తాము ఇచ్చిన రుణానికి సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు అని అంటున్నారు. ఆయా పనుల తీరు మీద పూర్తి స్థాయిలో సంతృప్తి చెందితేనే తరువాత విడత నిధులను రిలీజ్ చేస్తారు అన్న మాట.
ఈ విధంగా తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకోవాలని ఈ రెండు బ్యాంకులూ కూడా స్పష్టం చెసినట్లుగా తెలుస్తోంది. అభ్యంతరాలు కనుక ప్రపంచ బ్యాంక్ నుంచి వ్యక్తం అయితే తరువాత నిధుల విడుదల అన్నది కొంత ఇబ్బంది అవుతుంది.
అంటే ప్లాన్ ప్రకారం తాము ఇచ్చిన రుణ నిధులతో ఆరు నెలల కాలంలో ఏ పనులు చేపట్టారో ముందుగా తెలియ చేసి వాటిని చూపించాల్సి ఉంటుందన్న మాట. ఈ విధంగా షరతులు ఉండడం వల్లనే సీఆర్డీయే ఒక సమగ్రమైన ప్లాన్ తోనే ముందుకు వెళ్తోంది. టెండర్ల ప్రక్రియను కూడా వేగవంతం చేసి తొలి ఆరు నెలల కాలంలో చేపట్టబోయే పనులకు డివిజన్ గా చేసుకుంటోంది.
ఇక ప్రపంచ బ్యాక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల మరో షరతు ఏంటి అంటే తీసుకున్న రుణాలను పూర్తిగా వాటికే వెచ్చించాలని కోరడం. ఈ విధంగా ప్రపంచ బ్యాంక్ అధికారుల బృందం పూర్తి పర్యవేక్షణలో అమరావతి రాజధాని నిర్మాణం పనులు జరుగుతాయన్న మాట. 2025 జనవరి లో తొలి విడతో మొదలెడితే 2027 రెండవ అర్ధ భాగంలో చివరి విడత రుణ సాయం అందుతుంది అన్న మాట. మూడేళ్ల వ్యవధిలో ఈ రుణాలకు సంబంధించి సీఆర్డీయే అమరావతికి సంబంధించిన పూర్తి నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.