తెలంగాణాలో అక్కడ నుంచే రీ ఎంట్రీ ... బాబు మాస్టర్ స్కెచ్ ?

1982 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అప్పటి ప్రఖ్యాత తెలుగు సినీ నటుడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు.

Update: 2024-12-28 15:50 GMT

తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణా గడ్డ మీద 2025 మార్చి 29కి తెలుగుదేశం పార్టీ పుట్టి 43 ఏళ్ళు నిండుతాయి. 1982 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అప్పటి ప్రఖ్యాత తెలుగు సినీ నటుడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు.

అలా తెలంగాణా గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీకి ఈ రోజునా తెలంగాణాలో అభిమాన గణం ఉంది. అలాగే పార్టే అంటే మోజు పడే క్యాడర్ కూడా ఉంది. విభజన తరువాత కొన్ని అనివార్యమైన పరిస్థితులలోనే వారు అంతా ఇతర పార్టీల వైపు మళ్లారు.

దానికి తోడు సరైన నాయకత్వం అక్కడ లేకపోవడం, తెలుగుదేశం కూడా ఏపీ మీద ఫోకస్ చేసినంతగా తెలంగాణా మీద చేయకపోవడం మరో కారణంగా చెప్పాలి. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు విభజన రాష్ట్రంతో కొత్త సమస్యలు సవాళ్ళూ ఎదురయ్యాయి. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండడంతో దాని మీదనే పూర్తి సమయం వెచ్చించాల్సి వచ్చింది.

అయితే 2019లో ఓటమి లభించింది. దాంతో ఏపీలో అధికారం అందుకోవడానికి అయిదేళ్ల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఇపుడు ఏపీలో పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. దాంతో తెలంగాణా మీద తెలుగుదేశం ఫోకస్ పెడుతోంది. 2014లో పోటీ చేస్తే 15 దాకా ఎమ్మెల్యే సీట్లు తెలంగాణాలో వచ్చాయి. 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే అయిదు దాకా సీట్లు దక్కాయి.

ఇక 2023లో అయితే అసలు పోటీ చేయలేదు. ఇలా విభజన తరువాత మూడు ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల రాజకీయాల్లో తగ్గిపోతూ వస్తోంది. ఇపుడు మాత్రం మళ్లీ అక్కడ పుంజుకోవాలని చూస్తోంది. దానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ బలాన్ని ఎక్కువగా తీసుకున్న బీఆర్ఎస్ విపక్షం లోకి వచ్చేసింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా చెప్పుకున్నా ప్రాంతీయ రాజకీయాలకే పరిమితంగా ఉంది. కేసీఆర్ చరిష్మా మీదనే ఆ పార్టీ ఆధారపడి ఉంది. ఇంకో వైపు జాతీయ స్థాయిలో బీజేపీతో టీడీపీకి పొత్తు ఉంది. జనసేనతో కూడా బంధం ఉంది. ఈ మూడూ కలసి ఏపీలో అద్భుత విజయాన్ని అందుకున్నాయి. అదే ఎన్డీయేను తెలంగాణాలో విస్తరించాలన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.

దాని కంటే ముందు సొంతంగా టీడీపీ బలపడడానికి చూస్తోంది. ముందు తాను బలంగా నిలబడితే ఆ మీదట పొత్తులతో ఏదో విధంగా తెలంగాణాలో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చు అని చూస్తోంది. ఈ క్రమంలో టీడీపీ రాజకీయ వ్యూహకర్తలు అయిన ప్రశాంత్ కిశోర్, అదే విధంగా రాబిన్ శర్మలతో గ్రౌండ్ లో టోటల్ గా వర్క్ చేయించి ఒక కచ్చితమైన స్టడీ రిపోర్టుని తీసుకుంది అని అంటున్నారు.

ఈ నివేదిక ఇపుడు చంద్రబాబు లోకేష్ ల వద్ద ఉందని అంటున్నారు. దాని ప్రకారం చూస్తే టీడీపీని తెలంగాణ లో బలంగా విస్తరించేందుకు గల అవకాశాలు అందులో ఉన్నాయని అంటున్నారు. దాని ప్రకారం తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలోని మొత్తం పది ఉమ్మడి జిల్లాలలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి రీ ఎంట్రీ ఇస్తే సైకిల్ జోరు బాగా అందుకుంటుందని నివేదికలో స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.

దాని ప్రకారం చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచే పార్టీని బలోపేతం చేస్తారని అంటున్నారు. నిజానికి టీడీపీకి దక్షిణ తెలంగాణాలో మంచి బలం ఉంది. ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో టీడీపీకి ఇంకా గట్టి పునాదులు ఉన్నాయని కూడా చెబుతున్నారు. అంటే మొత్తం ఉమ్మడి పది జిల్లాలలో సగానికి సగం జిల్లాలలో టీడీపీకి బలం బాగానే ఉంది అంటున్నారు.

దాంతో ఇప్పటి నుంచే పటిష్టం చేసుకుంటే 2028 నాటికి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్స్ గా మారుతుందని అంటున్నారు. దాంతో ఆ దిశగా టీడీపీ అధినాయకత్వం ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే టీడీపీకి తెలంగాణా అధ్యక్షుడిని ఎంపిక చేసి ఆ మీదట కార్యక్రమాలను ఊపందుకునేలా చేస్తారు అని అంటున్నారు.

Tags:    

Similar News