ఆర్గనైజ్డ్ క్రైమ్ వర్సెస్...కరడు కట్టిన నేరస్తులు
అంతే కాదు ఒకరిని మరొకరు కఠినంగానే నిందించుకుంటున్నారు.
ఏపీలో రాజకీయాలు కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. రాజకీయ పక్షాలు అన్నవి ప్రత్యర్థులుగా కంటే కూడా శత్రువులుగా మారిపోయాయి. ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. అంతే కాదు ఒకరిని మరొకరు కఠినంగానే నిందించుకుంటున్నారు.
రాజకీయ విమర్శలు కూడా హద్దులు దాటేశాయి. మీరు ఫలానా అంటే మీరు ఫలానా అని డైరెక్ట్ గానే హాట్ కామెంట్స్ చేసుకుంటున్నారు. వైసీపీ అధినాయకులకు రాజకీయ ముసుగులో కరడు కట్టిన నేరస్తులు వస్తున్నారని చంద్రబాబు సహా కీలక నేతలు విమర్శిస్తున్నారు. క్రిమినల్ పాలిటిక్స్ అని బాబు పదే పదే అంటున్నారు.
ఇలాంటి వారితోనా నా రాజకీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మందిని చూశానని వారితో రాజకీయ సమరం సాగించాను అని కానీ జగన్ వంటి వారిని ఇప్పటిదాకా చూడలేదని బాబు ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. ఆయన వ్యవహారం తనకు అర్థం కాదు అది పద్ధతి కాదని ఘాటు విమర్శలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ సైతం టీడీపీని కూటమి నేతలను ఆర్గనైజ్డ్ క్రైమ్ అని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన మీడియా మీటింగ్ ని తాజాగా పెట్టి ఇవే ఆరోపణలు చేశారు. అంతా ఒక పద్ధతి ప్రకారం విష ప్రచారం చేస్తూ మేకను సైతం కుక్క అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడం అంటే ఇదే అని ఆయన అంటున్నారు. వైసీపీ మీద బురద జల్లుతూ ప్రజలను మభ్యపెడుతూ అంతా ఒక సంఘటిత శక్తిగా మారారని అంటున్నారు. అంతే కాదు చంద్రబాబు లాంటి వారు అరుదుగా ఉంటారని ఆయన ఏపీకి చెందిన వారు కావడం మన ఖర్మ అని కూడా విమర్శించారు.
తాను బాబు లాంటి వారితో రాజకీయ యుద్ధం చేయడం బాధాకరం అని కూడా జగన్ అంటున్నారు. ఇలా చూస్తే కనుక బాబు లాంటి వారు ఎవరూ ఉండరని ఆయన ఆలోచనలు వేరు అని జగన్ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇక ఆయన అలాగే ఉంటారని ఎప్పటికీ మారరని మోసం చేయడమే ఆయన నైజం అని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అదే విధంగా ఆయనతో తనకు రాజకీయ సమరం ఏంటని వాపోతున్నారు.
మరి చంద్రబాబు కూడా అవే మాటలు అంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన నేరస్తుల ముసుగుని తొలగిస్తామని అందరి ఆట కట్టిస్తామని కూడా వార్నింగులే ఇస్తున్నారు. మరి ఈ ఇద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు పదునైన విమర్శలు చేసుకోవడమే కాదు రాజకీయాలు ఇలాంటి వారితోనా చేయడం అని అనడం అంటే చిత్రంగానే ఉంది.ఈ ఇద్దరినీ చూస్తున్న ప్రజలు కానీ మేధావులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయం హద్దులు దాటితే ఇలాగే ఉంటుందని అంటున్నారు.
ప్రజల కోణంలో చేసే రాజకీయంలో పోటీదారులే ఉంటారని కానీ ఇపుడు ప్రత్యర్ధుల స్థాయిని మించి పోయి పొలిటికల్ గా ఒకరిని ఒకరు ఎలిమినేట్ చేసుకోవాలని పడుతున్న ఆరాటం నుంచే ఇవన్నీ వస్తున్నాయని అంటున్నారు. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా అంటే జవాబు అందరికీ తెలిసిందే.