ఏపీలో వాట్సప్ గవర్నెన్స్... ఈ సవాళ్ల పరిగణన అనివార్యం!

ఈ సర్వీసులపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. బర్త్, నేటివిటీ, క్యాస్ట్, అడంగల్ వంటి సుమారు 150 సర్వీసులు ఆన్ లైన్ చేయనున్నట్లు వెల్లడించారు.

Update: 2025-01-21 21:30 GMT

ఏపీలో చంద్రబాబు సరికొత్త ఆలోచన అని చెబుతున్న "వాట్సప్ గవర్నెన్స్" పై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సర్వీసులపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. బర్త్, నేటివిటీ, క్యాస్ట్, అడంగల్ వంటి సుమారు 150 సర్వీసులు ఆన్ లైన్ చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ సమయంలో... ఏపీ సర్కార్ "వాట్సప్ ఆధారిత పాలన"ను ప్రవేశపెట్టాలంటూ తీసుకున్న నిర్ణయంలో కొన్ని అవకాశాలు ఉంటే.. మరికొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకూ ఆ సవాళ్లు ఏమిటి.. వాటిని అదిగమించడానికి సర్కార్ చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనేది ఇప్పుడు చూద్దామ్..!

డిజిటల్ యాక్సెస్ సమస్యలు!:

వాట్సప్ ఆధారిత పాలనను అమలు చేయడంలో అత్యంత ప్రధానమైన సవాళ్లలో ఒకటి ఈ డిజిటల్ యాక్సెస్. ప్రధానంగా.. తెలుగు రాష్ట్రాంలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజానికం స్మార్ట్ ఫోన్లు, వాటికి ఇంటర్నెట్ కనెక్షన్లు, డేటా సౌకర్యాలు కలిగి ఉండరనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో అలాంటీ వారికి ఈ వాట్సప్ ఆధారిత సేవలను ఉపయోగించుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వొచ్చని అంటున్నారు.

ఇదే సమయంలో... వయోభారంతో ఉన్నవారు పేదవర్గాలకు చెందినవారు ఈ సాంకేతికతను పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతున్నారని అంటున్న నేపథ్యంలో.. వాట్సప్ ను సులువుగా ఉపయోగించలేని వర్గాల నుంచి ఇది నిరాకరణ, నిరాదరణకు గురి కావొచ్చు అని అంటున్నారు. ఈ సమస్యను ఎంతో కొంత తగ్గించడానికి ప్రభుత్వం ఏదైనా ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తుందా అనేది వేచి చూడాలి.

భద్రత, గోప్యత సమస్యలు!:

వాట్సప్ ఆధారిత పాలనను అమలు చేయడంలో ఎదురయ్యే మరో ప్రధాన సమస్య సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని చెప్పొచ్చు. స్మార్ట్ ఫోన్ ఉండి, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి వాట్సప్ ఉన్నప్పటికీ.. తమ వ్యక్తిగత లేదా ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు షేర్ చేస్తే.. సైబర్ దాడులు జరిగి, డేటా లీకేజీకి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇదే సమయంలో... ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా దీనికి అనుబంధంగా ఉన్న మరో సమస్య అని అంటున్నారు. ప్రభుత్వ సేవలు అందించేటప్పుడు సరిగ్గా గుర్తించని పక్షంలో అనేక మోసాలకు అవకాశం ఉంటుందని.. వాట్సప్ ఆధారిత సేవల విధానంలో ఖచ్చితమైన గుర్తింపును కన్ఫాం చేయడం కాస్త కష్టమైన పనే అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ లు!:

ప్రస్తుత సోషల్ మీడియా, వాట్సప్ ప్రపంచంలో తప్పుడు సమాచారం వ్యాప్తి అనేది అతి పెద్ద సవాలుగా మారింది. వీటి ఫలితంగా ఏపీ సర్కార్ వాట్సప్ గవర్నెన్స్ పై నమ్మకం తగ్గిపోయే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ ఫేక్ న్యూస్ లు పాలనా వ్యవస్థకు ప్రధాన శత్రువులుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ సవాళును అధిగమించడానికి వాస్తవ సమాచారాన్ని సరైన సమయంలో ప్రజలకు అందించే ఓ యాక్టివ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనివార్యం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఫార్మల్ రికార్డుల కొరత!:

వాస్తవానికి ప్రభుత్వ పాలనా కార్యక్రమాల్లో పారదర్శకతతో పాటు డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యమైనది. అయితే... వాట్సప్ అనేది ఫార్మల్ రికార్డులు ఉంచడంలో సమర్ధవంతమైంది కాదనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఫలితంగా... ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారన్ని సరిగ్గా రికార్డ్ చేయడం సమస్య కావొచ్చని అంటున్నారు.

రాజకీయ దుర్వినియోగం!:

వాట్సప్ ఆధారిత పాలనలో మరో కీలక సమస్య రాజకీయ దుర్వినియోగం కావొచ్చని అంటున్నారు. ఈ తరహా విధానం వల్ల వాట్సప్ గ్రూపు, మెసేజ్ లను ఒక రాజకీయ పార్టీ తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.

సేవల పరిమితి:

వాస్తవానికి వాట్సప్ అనేది సంభాషణల కోసం రూపొందించబడిందనే చెప్పాలి. అయితే.. అది ప్రభుత్వ పాలనా సేవలను నిర్వహించడానికి పూర్తిగా సరిపోదని చెప్పుకోవాలి! ఉదాహరణకు లైసెన్సులు, అధికారిక ఫిర్యాదులు - పరిష్కారాలు, సబ్సిడీలు వంటివి వాట్సప్ లో చేయడం కష్టమనే చర్చా జరుగుతుందని చెబుతున్నారు.

ఏది ఏమైనా... టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలకు త్వరితగతిన సేవలను కొంత వరకూ అందిచడంలో వాట్సప్ వంటి ఫ్లాట్ ఫారంలు సహాయపడవచ్చు కానీ... దీని వెనుక ఉన్న సవాళ్లను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలనేది నిపుణుల అభిప్రాయంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాలు పలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అనివార్యం అని అంటున్నారు.

Tags:    

Similar News