ఇంట గెలిచిన బాబు...మరి జగన్ ?

ఆయనకు మమకారాలు ఉండవని రాజకీయమే చూస్తారని తన వారిని సైతం ఆయన రాజకీయాల కోసం దూరం పెడతారని.;

Update: 2025-03-07 02:30 GMT

చంద్రబాబు గురించి గతంలో ఒక మాట చెప్పుకునేవారు. అది ప్రత్యర్ధులు ఎక్కువగా చేసేవారు. ఆయనకు మమకారాలు ఉండవని రాజకీయమే చూస్తారని తన వారిని సైతం ఆయన రాజకీయాల కోసం దూరం పెడతారని. అయితే కాలం గడిచిన కొద్దీ బాబు మీద ఈ విమర్శలు నిందలుగా తేలిపోతున్నాయి. నిజాలు బయటకు వస్తున్నాయి.

బాబు అంటే ఫ్యామిలీ మాన్ అని ఇటీవల అనేక సందర్భాలలో రుజువు చేసుకున్నారు. ఆయనకు కుటుంబ బంధాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పకనే చెబుతున్నారు. నందమూరి నారా వారి కుటుంబాల మధ్య ఎంతటి ఎమోషనల్ బాండేజ్ ఉందో తెలిసిందే. తాజాగా దగ్గుబాటి వారి కుటుంబం కూడా నారా వారితో చేయి కలిపింది. దాంతో ఎన్టీఆర్ కాలం నాటి ఎడబాట్లు పొరపాట్లకు ఇక తావు లేదు తామంతా ఒకే గొడుగు ఒకే అడుగు అని చాటి చెప్పినట్లు అయింది అంటున్నారు.

అన్న ఎన్టీఆర్ జీవించినపుడు అంతా ఒక్కటిగా ఉండేవారు. 1995 ఎపిసోడ్ తరువాత చీలిక వచ్చింది. అయితే ఆ తర్వాత బాబు తనదైన చాకచక్యంతో నందమూరి కుటుంబాన్ని కలుపుకున్నారు. తనతో విభేదించి అన్న తెలుగుదేశం పార్టీ పెట్టిన నందమూరి హరి క్రిష్ణను చేరదీసి రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆయనతో చివరి వరకూ మంచి రిలేషన్స్ కొనసాగించారు.

ఇక నందమూరి కుటుంబంలోని మిగిలిన వారు అంతా బాలక్రిష్ణ నాయకత్వంలో చంద్రబాబుకు మద్దతుగా ఉంటూ వచ్చారు. బాలయ్య టీడీపీలో సీనియర్ ఎమ్మెల్యేగా కీలక పాత్ర పోషిస్తున్నారు. బాబు కూడా బాలయ్యకు ఎంతో విలువ ఇస్తున్నారు. ఇటీవల బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఫ్యామిలీ అంతా గెట్ టు గెదర్ పెడితే దానికి అటెండ్ అయిన బాబు బాలయ్యతో తన అనుబంధాన్ని చాటుకున్నారు.

కట్ చేస్తే ఇపుడు దగ్గుబాటి వారితో బంధం పెనవేసుకోవడం. నిజానికి వెంకటేశ్వరరావు బాబుల మధ్య రాజకీయ విభేదాలు ఎక్కువగా ఉండేవి. ఇద్దరూ చెరో దారిగా ఉంటూ వచ్చేవారు. ఒకరు ఒక పార్టీలో ఉంటే రెండవవారు వేరొక పార్టీ అన్నట్లుగా వ్యవహరించారు. బీజేపీలో దగ్గుబాటి ఉన్నపుడు అదే బీజేపీ టీడీపీ పొత్తులు పెట్టుకున్నాయి. దాంతో దగ్గుబాటి కాంగ్రెస్ లో చేరారు.

బాబుతో నిత్యం విభేదించే వైఎస్సార్ తో అలా చేతులు కలిపారు. ఇక 2019 నాటికి వైఎస్సార్ కుమారుడు జగన్ పార్టీలో చేరి పర్చూరు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. ఇక ఇటీవల కాలంలోనే దగ్గుబాటి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆయన బాబుతో చేతులు కలపడం మాత్రం కొత్త విషయంగానే చూడాలని అంటున్నారు.

బాబు సూదంటురాయిలా అలా అందరినీ ఆకర్షిస్తున్నారు అనుకున్నారు కానీ దగ్గుబాటిని సైతం ఆయన ఆకర్షించడమే ఇక్కడ విశేషం. ఏది ఏమైనా దగ్గుబాటి దశాబ్దాల రాజకీయ వైరాన్ని మరచి బాబుతో కలసి ఉండడం ద్వారా గ్రేట్ అనిపించుకుంటే బాబు సూపర్ గ్రేట్ అనిపించుకున్నారు. ఈ తాజా కలయికతో చంద్రబాబు మొత్తం అంతా తన వారే అనిపించుకున్నారు. అలా విజయవంతంగా ఇంట గెలిచారు.

బాబు ఈ విధంగా వ్యవహరిస్తే వైసీపీ అధినేత జగన్ తీరు మరోలా ఉందని అంటున్నారు. ఆయన సొంత చెల్లెలు తల్లితో విభేదాలు కొనసాగిస్తూ కోర్టుకు వెళ్ళారని అంటున్నారు. బాబు తనకు రక్తసంబంధీకులు కాకపోయినా బంధువులు అందరినీ ఒక చోటకు చేర్చి వారితోనే తాను గ్రేట్ అనిపించుకుంటున్న తీరు వైసీపీ అధినాయకత్వానికి కూడా స్పూర్తి కావాలని అంటున్నారు.

రాజకీయాలు ఇతర వ్యవహారాలు ఎలా ఉన్నా రక్త సంబంధాలు బంధాలు అన్నవి ముఖ్యమని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నందమూరి నారా దగ్గుబాటి కుటుంబాలు ఒక్కటి అయిన తీరుని చూసిన వైసీపీ అభిమానులు వైఎస్సార్ ఆరాధకులు అంతా వైఎస్సార్ కుటుంబం కూడా ఒక్కటిగా ఉండాలని అంతా కళకళలాడుతూ కనిపించాలని గట్టిగా కోరుకుంటున్నారు. మరి అది జరుగుతుందా అంటే తలచుకుంటే అసాధ్యం ఏదీ లేదనే చెప్పాలి. కాకపోతే ఆ రోజు కోసం వెయిట్ చేయడమే అన్నది అభిమానుల మాట.

Tags:    

Similar News