బాబు 1995 అంటే జాగ్రత్త పడాల్సిందే ?
చంద్రబాబులో ఆ అగ్రెసివ్ మోడ్ ని చూసిన తరువాత జాగత్త పడాల్సిందే అని అధికార యంత్రాంగం భావిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తాను 1995 నాటి దూకుడు చూపిస్తాను అంటున్నారు. మొత్తం సిస్టం లో మార్పు తెస్తానని చెబుతున్నారు. అధికార వ్యవస్థను పరుగులు తీయిస్తామని కూడా అంటున్నారు. చంద్రబాబులో ఆ అగ్రెసివ్ మోడ్ ని చూసిన తరువాత జాగత్త పడాల్సిందే అని అధికార యంత్రాంగం భావిస్తోంది.
చంద్రబాబు తాజాగా నెల్లూరు జిల్లా టూర్ కి వెళ్లారు. అక్కడ ఆయన కార్యక్రమంలో మాట్లాడుదామని అనుకుంటే మైకు సరిగ్గా పని చేయలేదు. అంతే బాబు ఫైర్ అయిపోయారు. ఏమిటి ఇది అని ఆయన అన్నట్లుగా వార్తలు వచ్చాయి. జిల్లా స్థాయి అధికారులు సీఎం ప్రోగ్రాం లో ఇలాంటివి జరగకుండా చూసుకోలేరా అని బాబు అన్నట్లుగా తెలుస్తోంది.
తాను మళ్ళీ1995 నాటి బాబును అవుతానని ఆయన పదే పదే చెబుతున్నారు. ఏ మాత్రం అలసత్వం చూపించకుండా అధికారులు పనిచేయాలని బాబు గట్టిగా కోరుతున్నారు. తన పని తీరుతో పాటు తన ఆలోచనలు కూడా అందుకోవాలని ఆయన కోరుతున్నారు. డైనమిక్ గా అధికారులు ఉండాల్సిన అవసరం ఉందని బాబు చెబుతున్నారు.
ఎవరు ఎక్కడ నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నపుడు 1995 ప్రాంతంలో ఆయన స్పీడ్ ఒక లెక్కన ఉండేది. నేను నిద్రపోనూ మిమ్మల్ని నిద్రపోనీయను అని బాబు హెచ్చరించేవారు.
ఆ సమయంలో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తూ వచ్చారు. ఉదాశీనంగా ఉండే వారిని ఏ మాత్రం సహించేవారు కాదు. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు అధికారులకు పూర్తి సానుకూలంగా ఉంటూ వచ్చారు. అయితే అప్పట్లో పాత చంద్రబాబుని చూడలేకపోయామని జనంలో అనుకున్న సందర్భాలు ఉన్నాయి.
అధికారుల మీద ఒత్తిడి ఎక్కువ పెడితే వారు ఇబ్బంది పడతారు అని భావించే చంద్రబాబు ఆనాడు అలా వ్యవహరించారు. ఇక 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాలన మీద ఆ ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదని దాంతో అధికార యంత్రాంగంలో కొంత ఉదాశీన భావన ఏర్పడింది అని అంటున్నారు.
వ్యవస్థలను కూడా వైసీపీ పాలకులు తమకు అనుకూలంగా చేసుకుని ప్రజా పాలన పట్టించుకోలేదని కూడా టీడీపీ విమర్శలు చేసింది. అందుకే పూర్వం చురుకుదనాన్ని మొత్తం వ్యవస్థలో తీసుకుని రావడానికి చంద్రబాబు దూకుడుగా ఉండక తప్పేట్లు లేదని టీడీపీ వర్గాలు అంటున్నారు.
ఏపీ పునర్ నిర్మాణం లో అధికారుల పాత్ర చాలా కీలమని అందువల్ల వారిని పూర్తి స్థాయిలో అలెర్ట్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే అధికారులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని అయితే నిధులతో ముడిపడిన సమస్యలను వారు పరిష్కరించలేరని అంటున్నారు. అందువల్లనే కొన్ని సమస్యలు పెండింగులో ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి అని అంటున్నారు.
జనంలో ఫలానా పని ఎందుకు చేయలేదు అని అధికారులను అడిగినపుడు ఇవన్నీ వారు ప్రస్తావించలేరని అధికారులు పనిచేయాలంటే నిధులు కూడా ఉండాలి కదా అని వారి నుంచి వస్తున్న మాట. ఏది ఏమైనా చంద్రబాబు తాము మునుపటి ముఖ్యమంత్రిని అవుతాను అని చెబుతున్నారు. ఆ దూకుడు బాబు చూపిస్తాను అని చెబుతున్నారు. తాను జిల్లల టూర్లకు వచ్చేటపుడు పెండింగులో ఏ సమస్యా ఉండరాదని అంటున్నారు. మరి ఇది ఒక విధంగా అధికారులకు ఇబ్బందిగానే ఉంది. అయితే పనిచేసే అధికారులు అపుడూ ఇపుడూ ఉన్నారు. చేయని వారికి మాత్రం బాబు మార్క్ ట్రీట్మెంట్ ఇస్తే తప్పేమీ లేదని అంటున్నారు.